Nalgonda: మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు దొరికినట్టుగా వార్తలు వినవస్తున్నాయి. రాత్రి నల్లగొండలోని ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు అక్కడకు చేరుకునే సమయంలో జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో లేరు. ఆ తరువాత ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. అయితే ఈ తనిఖీలను ఐటీ అధికారులు అధికారంగా వెల్లడించలేదు. పట్టుబడిన నగదు సమాచారం తెలియాల్సి ఉంది. సోదాల సందర్బంగా పలు డాక్యుమెంట్లతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మునుగోడు ఉపఎన్నిక బాధ్యతను టీఆర్ఎస్ అధిష్ఠానం మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించింది. ఉపఎన్నికలో విజయం సాధించేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంలో జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. రెండు రోజుల క్రితం ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు ఇచ్చింది. మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని మరువక ముందే మంత్రి పీఏ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేయడం గమనార్హం.