MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఈ విచారణ కొనసాగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు 8 గంటలు గడుస్తున్న.. కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
8 గంటలకు పైగా విచారణ
ఉదయం నుంచి కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు.. అక్కడి నుంచి బయటకు పంపేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను కవిత ఎదుర్కొంటున్నారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం కవితను ప్రశ్నిస్తోంది. కవిత విచారణకు మధ్యలో అయిదు నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. విచారణ గది నుంచి బయటకు వచ్చిన ఆమె మళ్లీ లోపలికి వెళ్లారు. ఆడిటర్ బుచ్చిబాబు, విజయ్ నాయర్, మనీష్ సిసోడియా స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ప్రశ్నించినట్టు సమాచారం. కవిత ఈడీ విచారణ గంటల తరబడి కొనసాగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ దిల్లీలోనే ఉన్నారు.
కవిత కోసం దిల్లీకి కేటీఆర్.. (MLC Kavitha)
కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్ అన్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేద్దాం, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పార్టీ నాయకులతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అదే విధంగా నిన్న పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కవితకు మద్దతుగా పోస్టర్లు..
ఈడీ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. రెయిడ్స్ కి ముందు తర్వాత అంటూ పోస్టర్లను అతికించారు. ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఇవి అందరిని ఆకర్షిస్తున్నాయి. భాజపాలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు భాజపా నేతల ఫొటోలతో నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకొని భాజపాలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలతో విమర్శలు కురుస్తున్నాయి. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పశ్చిమ బెంగాల్ భాజపా ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీకి చెందిన భాజపా నేత సుజనా చౌదరి, కేంద్ర మంత్రి నారాయణ్ రాణెతో పోలుస్తూ.. రెయిడ్స్‌కి ముందు తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు నగరంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మోదీని విమర్శిస్తూ కూడా హైదరాబాద్ లో పోస్టర్లు సైతం దర్శనమిచ్చాయి. ప్రధాని మోదీని రావణాసురుడితో పోలుస్తూ.. సీబీఐ, ఈడీ, ఐటీ, ఈసీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఈ పోస్టర్లను రూపొందించారు.