Harish Rao Comments: రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. మరోవైపు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై కూడా పలు విమర్శలు చేశారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ట్విటర్ వేదికగా స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి నిర్మల సీతారామన్, గవర్నర్ తమిళి సై వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని మంత్రి ధ్వజమెత్తారు. ఈ మేరకు అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారని.. అందుకు కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని పేర్కొంటూ ఓ వీడియోను మంత్రి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ రావు ఈ అంశంపై వరుస ట్వీట్లు చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో కేంద్ర మంత్రులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఒకరు తెలంగాణ మెడికల్ కాలేజీలు కావాలని కోరలేదంటే.. మరొకరు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్‌లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవటం వల్లే కొత్తవి మంజూరు చేయలేదంటున్నారని మండిపడ్డారు.
CM #KCR Garu setup 12 medical clgs with state's own funds in tune to vision of 1️⃣medical clg in each dist.
TS tops in country with 19 MBBS seats per lakh population?
Instead of hurling abuses, Centre & governor shud appreciate TS govt for opening 8️⃣colleges in a single day 3/5— Harish Rao Thanneeru (@BRSHarish) March 5, 2023
ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని సైతం మంత్రి ట్వీట్‌కు జతచేశారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని హరీశ్ రావు అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్.. రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు చేసే బదులుగా ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలన్నారు. ఈ సందర్భంగా బీబీనగర్ ఎయిమ్స్‌కి నిధుల కొరత ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ వృద్ధి కోసం రూ.1,365 కోట్లు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు మాత్రం కేవలం రూ.156 కోట్లే కేటాయించటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్ ఎయిమ్స్‌కి 52 శాతం , తెలంగాణ 11.4 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తన పంథాను మార్చుకొని… ట్రైబల్ యూనివర్సిటీ, రైల్ కోచ్‌లు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వారవుతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.