KTR Gets Interim Protection from Arrest: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో తనని అరెస్ట్ చేయకుండ పోలీసులకు ఆదేశాలని ఇవ్వాలని కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పటిషన్ దాఖలు చేశారు. ఇవాళ (డిసెంబర్ 20) లంచ్ మోషన్ పటిషన్ వేయగా తాజాగా న్యాయస్థానం విచారించింది.
10 రోజుల వరకు కేటీఆర్‌ని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశిస్తూ.. ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఏసీబీ విచారణకు సహకరించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కేటీఆర్‌ను ఆదేశించింది. కాగా ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ద్వారా నిధులను విదేశాలకు మళ్లీంచారని ఆరోపణలతో కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసు విచారణను తెలంగాణ ఏసీబీకి ఇచ్చారు. దీంతో హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కాసేపటి కిందట హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం కోర్టులో తన వాదనలు వినిపించారు.
అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని, అవి ఈ కేసు కింద వర్తించవని ఆయన కోర్టుకు తెలిపారు. గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారని, ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగినట్టు స్పష్టం చేశారు. సీజన్ 9తో రాష్ట్రానికి రూ. 110 కోట్ల లాభం వచ్చిందని, సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకున్నట్టు కోర్టుకు తెలిపారు. అయితే ఆ ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని ఆయన హైకోర్టుకు స్పష్టం చేశారు.