Bayyaram: పునర్విభజన చట్టంలో హామీలో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పై నీలిమబ్బులు కమ్ముకోవడంతో అధికార టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. పరిస్ధితుల అందుకు తగ్గట్టుగా లేవని, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటనతో ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసనలు గుప్పించారు.
మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కిషన్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి భాజాపాకు వ్యతిరేకంగా నినదించారు. ఉక్కు పరిశ్రమల కావాల్సిందేనంటూ రాస్తా రోకోలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, మంత్రులు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదన్న మాటలు కిషన్ రెడ్డివా, కేంద్రానివా అంటూ ప్రశ్నించారు. గతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అనువుగా ఉందన్న నిపుణుల కమిటీ మాటేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణాలో పుట్టారా అన్న సందేహం కూడా కలుగుతుందన్నారు. ఉత్సవ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. 100 సంవత్సరాలకు సరిపడా ముడి ఉక్కు నిల్వలు బయ్యారంలో ఉన్నాయంటూ నేతలు వాదించారు. కార్యక్రమాల్లో ఎమ్యెల్యే రెడ్యానాయక్, ఎంపీ మాలోత్ కవిత, మంత్రి సత్యవతి రాధోడ్ లతోపాటు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: దెయ్యం నడవడం వీడియోపై కేసు నమోదు