Hyderabad: హైదరాబాద్‌లో వరుస చిన్నారుల మిస్సింగ్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మరువకముందే నగరంలో ఓ బాలుడు అదృశ్యమవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పాతబస్తీలో నివాసం ఉంటున్న మహమ్మద్ నసీర్ అనే 13 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. ఇందు అనే చిన్నారి ఈ నెల 15న అదృశ్యమవ్వగా.. ఈ నెల 14న నసీర్ కనిపించకుండా పోయాడు. కానీ నసీర్ మిస్సింగ్ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు కేసులు ఇప్పుడు భాగ్యనగర పోలీసులకు సవాల్‌గా మారాయి. నగరంలో జరుగుతున్న చిన్నారుల వరుస మిస్సింగ్‌లు తల్లిదండ్రులను ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మహమ్మద్ నసీర్ కుటుంబం పాతబస్తీలోని హుస్సేనీ ఆలం ఫతే దర్వాజాలో నివాసం ఉంటుంది. ఈ నెల 14న సాయంత్రం కూరగాయల కోసం బయటకు వెళ్లిన నసీర్.. రాత్రి అయినా ఇంటికి రాలేదు. దానితో ఆందోళనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఎంత వెతికినా తమ కుమారుడి ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బీహార్‌కు చెందిన యూసుఫ్ అనే వ్యక్తి నసీర్ ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు యూసుఫ్ ఎందుకు బాలుడిని కిడ్నాప్ చేశాడు? కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మరోవైపు దమ్మాయిగూడలోని ఇందు డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. స్థానిక జెడ్పీహెచ్ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఇందు.. 15వ తేదీన అదృశ్యమైంది. స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇందు.. శుక్రవారం దమ్మాయిగూడలోని అంబేద్కర్ నగర్‌లోని చెరువులో శవమై కనిపించింది. చిన్నారి మృతికి గల కారణాలు ఏంటనేది ఇంకా తేలియలేదు. ఇదిలా ఉంటే ఇందు మృతి గంజాయి ముఠా పనేనంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్: బాలిక మిస్సింగ్ కేసు.. దమ్మాయిగూడ చెరువులో దొరికిన చిన్నారి మృతదేహం