Site icon Prime9

Munugode: మునుగోడులో ఎర్రసైన్యం ఎందుకు చేతులెత్తేసింది ?

Telangana CPI to toss hand into Munugode

Telangana CPI to toss hand into Munugode

Munugode: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఆ ఉపఎన్నికే కమ్యూనిస్టుల్లో కల్లోలం రేపుతోందా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్టుగా కమ్యూనిస్టులు ‘ఎర్ర గులాబీ’లుగా మారారా..? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 30 ఏండ్ల పాటు మునుగోడు నియోజకవర్గాన్ని శాసించిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)కి ఏం అయ్యింది..నియోజకవర్గంలో పట్టు కోల్పోయారా.. ఎందుకు పొత్తుకు సిద్ధం అయ్యారు పార్టీ క్యాడర్లో తలెత్తుతున్న ప్రశ్నలు.తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక వచ్చింది. ఈసారైనా సీపీఐ పోటీ చేసి తన ఓటు బ్యాంకును నిలుపుకుంటేదేమోనని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించి.. కమ్యూనిస్టు శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఓటు బ్యాంకు నేటికీ బలంగానే ఉందనేది ప్రచారంలో ఉంది. దీంతో సీపీఐ రాష్ట్ర నాయకత్వం నిర్ణయంపై మునుగోడు సీపీఐ శ్రేణులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 1967 నుంచి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో భారత కమ్యూనిస్టు పార్టీ 8 సార్లు పోటీ చేయగా, 5 సార్లు తిరుగులేని విజయం సాధించింది. కాగా కాంగ్రెస్ 6సార్లు గెలుపొందింది. టీఆర్ఎస్ మాత్రం 2014 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. అయితే మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జనరల్ స్థానం రిజర్వు కావడం గమనార్హం. సీపీఐ పార్టీ 1985, 1989,1994 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. అనంతరం 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈ ఐదుసార్లు గెలిచిన ఎన్నికల్లో సీపీఐ సగటు ఓట్లు 50వేలకు పైగా ఉండడం గమనార్హం. మునుగోడు సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు 3సార్లు, పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు చేరోసారి విజయం సాధించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రతిసారి దాదాపుగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడవడం గమనార్హం.మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ హావా 2009 వరకు కొనసాగింది. ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. కానీ ఊహించని విధంగా 2014 ఎన్నికల్లో సీపీఐ పార్టీ నాలుగో స్థానానికి పడిపోయింది. నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రీయాశీలకంగా టీఆర్ఎస్‌తో పాటు సీపీఐ పోరాడింది. అలాంటిది 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 69,496 ఓట్లు సాధించి గెలుపొందితే.. ఇండిపెండేంట్‌గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి 27,441 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డి సైతం 27,434 ఓట్లతో మూడు స్థానంలో, సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్ రెడ్డి 20,952 ఓట్లతో నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. వాస్తవానికి 2009 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి ఉజ్జిని యాదగిరిరావు 57,383 ఓట్లతో గెలుపొందితే.. 2014 ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 20,952 ఓట్లతో నాలుగో స్థానంలో నిలవడం కొసమెరుపు. దీనంతటికి ప్రధాన కారణం సీపీఐ పార్టీ చేజేతులా తన ప్రభాల్యాన్ని వదులుకోవడమేననే ఆరోపణలు లేకపోలేదు.

మునుగోడు నియోజకవర్గాన్ని 50 ఏండ్ల పాటు సీపీఐ తన ప్రభావాన్ని చూపింది. ఇందులో 25 ఏండ్ల పాటు మునుగోడు నుంచి గెలిచి తన చేతుల్లోనే నిలుపుకుంది. నిత్యం ప్రజాపోరాటాలపై స్పందిస్తూ.. ప్రజల సమస్యలే తమ సమస్యలుగా సీపీఐ మునుగోడులో పోరాడింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు సీపీఐకి బ్రహ్మరథం పట్టారు. దీంతో మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ చెప్పిందే వేదంగా మారింది. కానీ 2014 ఎన్నికల్లో అనుహ్యంగా ఘోర పరాభవాన్ని చవిచూసింది. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహారించినా సీపీఐ ఎందుకు పతాకస్థాయి నుంచి అథోపాతాళానికి పడిపోయిందనే అంశాన్ని బేరీజు వేసుకోవడంలో విఫలమయ్యింది. అయితే 2018 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీపీఐ పోటీ చేయకపోవడం.. తదనంతరం మునుగోడు ప్రజాసమస్యలపై సీపీఐ తన వాణిని విన్పించకపోవడంతో ప్రజలకు దూరమయ్యిందనే చెప్పాలి. చూడాలి మరి సీపీఐ పార్టీ క్యాడర్ ఎలా వ్యవహరిస్తుందో.

Exit mobile version