Mancherial: ఇద్దరు యువతుల సహజీవనం చివరికి విషాదాంతమైంది. స్నేహం కాస్త ప్రేమగా మారి.. సహజీవనానికి దారి తీసింది. కాని చివరికి అది హత్యతో విషదంగా మిగిలింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. అది కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. కానీ వీరి సహజీవనం చివరికి విషాదంతో ముగిసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో.. ఓ యువతి తన స్నేహితురాలినే హత్య చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టుకు చెందిన సల్లూరి అంజలి.. తరచూ మన్నెగూడంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండేది.
ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన పెరుగు మహేశ్వరి అలియాస్ మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వారి ప్రేమకు దారి తీసింది.
దీంతో వీరు మంచిర్యాలలో గది అద్దెకు తీసుకుని మహేశ్వరి, ఆమె చెల్లి పరమేశ్వరి, సోదరుడు విఘ్నేష్‌తో పాటు అంజలి కలిసి ఉంటున్నారు. అంజలి స్థానిక కళ్లద్దాల దుకాణంలో పనిచేస్తుండగా, మహేశ్వరి ఓ పెట్రోల్ బంకులో పనిచేసి ఇటీవల మానేసింది.
మన్నెగూడంకు చెందిన వీఆర్‌ఏ మొండి అయిదుగురు ఆడపిల్లల్లో నాలుగో కుమార్తె మహేశ్వరి.
గత పదేళ్లుగా ఆమె వస్త్రధారణ, ప్రవర్తన అబ్బాయిలా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే మహేశ్వరి, అంజలి సహజీవనం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో.. స్థానికంగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌తో మహేశ్వరికి పరిచయమైంది. తర్వాత ఆమె చెల్లెలు, సోదరుడు, అంజలితోనూ ఆయనకు పరిచయం ఏర్పడింది.
రెండు నెలలుగా అంజలి శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెడుతూ వచ్చింది.
బుధవారం రాత్రి మామిడిగట్టుకు వెళ్దామంటూ.. మహేశ్వరి ద్విచక్ర వాహనంపై అంజలిని తీసుకెళ్లింది. అదే రాత్రి.. అంజలి ఆత్మహత్య చేసుకుందని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాని సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు.
అపస్మారక స్థితిలో ఉన్న అంజలిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అంజలి మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
ఇదే విషయమై పోలీసులు ప్రశ్నించంగా.. తానే హత్య చేసినట్లు మహేశ్వరి పోలీసుల ఎదుట ఒప్పుకుంది.
దీంతో అంజలి మృతికి కారకులను అరెస్టు చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.