Hyderabad: మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచారం జోరు పెంచాయి. ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. నవంబర్ 1 సాయంత్రం ఆరుగంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపధ్యంలో ఆదివారం చండూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరగనుంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎపిసోడ్లో తమకు లాభించిందని టీఆర్ఎస్ భావిస్తోంది.
చండూరులో జరిగే బహిరంగసభలో బీజేపీ పై కేసీఆర్ విరుచుకుపడే అవకాశముంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షడు నడ్డా సభ రద్దు కావడంతో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం పై దృష్టిసారించారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ అంతా డ్రామా అని మునుగోడులో ఓడిపోతామనే కేసీఆర్ ఈ నాటకానికి తెరతీసారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ముందు తడిబట్టలతో ప్రమాణం చేసారు. మరోవైపు కాంగ్రెస్ నవంబర్ 1న మహిళా గర్జన సభకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తమ అభ్యర్ది మహిళ కావడంవల్ల ఈ సభ ద్వారా సెంటిమెంట్ తో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది.