Site icon Prime9

Raithu Bandhu : రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్..

central election commission granted permission to Raithu Bandhu scheme

central election commission granted permission to Raithu Bandhu scheme

Raithu Bandhu : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంటుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పథకం అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌ ఆరంభానికి ముందు నిధులు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈసారి శాసనసభ ఎన్నికల దృష్ట్యా కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్‌కు నిధుల జమ ఇంకా జరగలేదు. ఇది కొనసాగుతున్న పథకమని కోడ్‌ వర్తించదని… యథావిధిగా ఈ సాయం విడుదలకు అనుమతించాలని ప్రభుత్వం గత నెలలో ఈసీని కోరుతూ లేఖ రాసింది.

కాగా ప్రభుత్వ అభ్యర్ధనను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. సుమారు 7వేల కోట్ల రూపాయల నిధులను దశల వారీగా రైతుబంధు (Raithu Bandhu) లో వేయనున్నారు. ఈ నెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని స్పష్టం చేసింది. 2018 అక్టోబరు అయిదో తేదీన కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులను పూర్తి చేయాలని నిర్దేశించింది. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

ఈసీ అనుమతించడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో శనివారం నుంచి సొమ్ము జమ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ మొత్తం రూ.7,700 కోట్లకుపైగా ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రభత్వ పథకాలు అమలులో ఉండవు. అందులో భాగంగానే మొదట రైతుబంధును నిలిపివేసినప్పటికీ.. తాజాగా పంపిణీకి అనుమతి లభించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ముందే రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్, బీజేపీలు దీన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ణప్తి చేశాయి.

 

Exit mobile version