MLA Chinnaiah CCTV: నా కారునే ఆపుతారా.. టోల్‌ప్లాజా సిబ్బందిని కొడుతున్న BRS బెల్లంపల్లి ఎమ్మెల్యే.. CCTV ఫుటేజ్ వైరల్

నా కారునే ఆపుతావా.. నేనెవరో తెలుసా.. నీ కెంత ధైర్యం ఉంటే నా కారుని ఆపుతావ్ అంటూ బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు.

MLA Chinnaiah: కొంత మంది ప్రజా ప్రతినిధులు తమ హోదా, స్థాయిని చూపించడం కోసం పేదలు కష్టజీవులపై దాడులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నా కారునే ఆపుతావా.. నేనెవరో తెలుసా.. నీ కెంత ధైర్యం ఉంటే నా కారుని ఆపుతావ్ అంటూ బీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది.

మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి సిబ్బంది టోల్‌ ఫీ వసూలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వాహనం కూడా టోల్‌ప్లాజా వద్దకు చేరుకుంది. టోల్ సిబ్బంది వారి ప్రోటోకాల్‌ ప్రకారం గేటు తీయడంలో ఆలస్యం చేశారు. దానితో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కారు దిగి వచ్చి టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహంతో రెచ్చిపోయి అక్కడే ఉన్న సిబ్బందిపై దాడికి దిగారు. దాంతో, సిబ్బంది అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడికి సంబంధించి సమీప సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందించారు.. ప్రోటోకాల్ ప్రకారం తన కారు వచ్చినప్పుడు రూట్ క్లియర్ చేయడంలో అక్కడి సిబ్బంది ఆలస్యం చేశారని అందుకే ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా రహదారి పనులు అసంపూర్తిగా ఉండగానే ప్రజల నుంచి టోల్‌ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటూ సిబ్బందిని ఆయన ప్రశ్నించారని చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం ఉచితంగా వెళ్లే రూట్లో కాకుండా టోల్ వసూలు చేసే మార్గంలోకి ఎమ్మెల్యే కారు రావడం వల్లే ఆలస్యం అయిందని చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటిదాకా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.