Bandi Sanjay: బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి ఇళ్లను కూల్చివేస్తామని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో భాజపా ఒంటిరిగానే పోటి చేస్తుందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే (పోటీ Bandi Sanjay)
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని విమర్శించారు. భాజపా దయ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడా చూసిన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం మహిళల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నారా.. లేరా? అనే సందేహం వస్తోందన్నారు. మహిళా మోర్చా రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. భాజపా దయవల్లే తెలంగాణ వచ్చిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం కోసమా తెలంగాణ తెచ్చుకుందని రాష్ట్ర ప్రజలు బాధ పడుతున్నారని సంజయ్ అన్నారు. ఒక కార్పొరేటర్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఆయనకు ట్విటర్ టిల్లు అని నామకరణం చేస్తే బాగుంటుంది అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పు మోపారని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు రాష్ట్రంలో లేదని అన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
యూపీ తరహాలోనే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేస్తాం
బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసే నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గుండాల ఆగడాలు పెరిగిపోయాయని.. వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని బండి సంజయ్ అన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటమే కేసీఆర్, కేటీఆర్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. హిందూ దేవుళ్లను కించేపర్చే విధంగా మాట్లాడేవారి తాటా తీస్తామని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఆడబిడ్డలను కన్నెత్తి చూడటానికి కూడా భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు దిల్లీ లిక్కర్ స్కామ్ పై బండి సంజయ్ స్పందించారు. కూతుర్ని ఎలా బయటపడేయాలో తెలియక కేసీఆర్ ఆగమాగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో.. నేరాల రేటు పెరిగిందని..రాష్ట్రంలో రోజుకో అత్యాచారం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఆర్‌లో మహిళలకు గౌరవం కూడా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం రాబోతోందని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు.