Site icon Prime9

Bandi Sanjay: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం పై రగడ

SSC Paper Leak Case

SSC Paper Leak Case

Hyderabad: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం పై రగడ మొదలయింది. దీనిపై అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం నడుస్తోంది. ప్రభుత్వం కావాలనే హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామంటోంది.

గణేష్ విగ్రహ నిమజ్జనం పై కొంత మంది కావాలనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఉత్సవ కమిటీ మండిపడింది. పోలీసులు సైతం నిమజ్జనాన్ని ముందే చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 9వ తేదీనే నిమజ్జన చేస్తామని కమిటీ తేల్చి చెప్పింది. సంప్రదాయం ప్రకారం అనంత చతుర్ధశి రోజునే వినాయకుని నిమజ్జనం చేయాలని, ఆ రోజే చేస్తామన్నారు. అందరూ అనంత చతుర్దశిని పాటించాలని ఉత్సవ కమిటీ కోరింది.

సుప్రీమ్ కోర్టు ఉత్తర్వుల పేరు చెప్పి నిమజ్జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రశాంత వాతావరణంలో హిందువులు నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని అనుకుంటున్నారని, ప్రభుత్వం ఆపాలని చూస్తే, ఆ కార్యక్రమం ఆగదని హెచ్చరించారు. నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే మాత్రం నిమజ్జనం ట్యాంక్ భవన్‌లో కాకుండా ప్రగతి భవన్‌లో చేస్తామని హెచ్చరించారు. భయపెట్టాలని చూస్తే హిందూ సమాజం భయపడదని అన్నారు.

గణేష్ నిమజ్జనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, అన్ని కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాట్లాడటం హస్యాస్పదమన్నారు. గణపతి పండుగ అంటే జాతీయ సమైక్యతను పెంపొందించడానికి స్వాతంత్రోద్యమ కాలంలో ప్రారంభమయిన పండుగ అని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 9వ తేదీన అన్ని కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.

Exit mobile version