Site icon Prime9

Ys Avinash Reddy : నేడు వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ.. తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ

Ys Avinash Reddy

Ys Avinash Reddy

Ys Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్‌ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చెప్పినప్పటికీ జాబితాలో ఆ పిటిషన్‌ లేదు. దీంతో కోర్టు మొదలవుగానే వైఎస్ అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో జాబితాలో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరగా.. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు.

నేడు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపడతామని తెలిపారు. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి గతంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఉపశమనం కల్పించింది. అయితే, ఆ ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాంటి ఆదేశాలను ఎలా ఇస్తారని ప్రశ్నించింది. కనీసం 24 గంటల పాటు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్‌ రెడ్డి న్యాయవాదుల విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. విచారణలో భాగంగా ముందుగానే లిఖితపూర్వక ప్రశ్నలు అందించాలన్న అంశాన్ని తప్పుబట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో వైఎస్ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న ఈ కేసులో అవినాష్ అరెస్ట్ వ్యవహారం గురించి కూడా కొందరు జోరుగా బెట్టింగ్ లు కూడా నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు గురువారం నాడు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో షర్మిలా మాట్లాడుతూ.. ఆస్తుల కోసం తన చిన్నాన్న వివేకా హత్య జరగలేదని.. సునీత పేరు మీదే ఆస్తులను వివేకా ఎప్పుడో వీలునామా రాశారని పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తిపై విష ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు వివేకా ఎలాంటి వారో తెలుసునని..  ఆయన వ్యక్తిగత జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఆస్తుల కోసం వివేకాను చంపాల్సిన అవసరం లేదని షర్మిల మరోసారి పునరుద్ఘాటించారు.

ఇప్పటికే వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి ఈ కేసులో అవినాష్ రెడ్డి కి సమబంధం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ కేసులో సీబీఐ తనను కుట్రపూరితంగా ఇరికించాలని చూస్తోందన్నారు అవినాష్ రెడ్డి. వివేకా హత్య కేసు ఛేదన కంటే తనను ఇరికించేందుకే సీబీఐ ఎక్కువగా ప్రయత్నిస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఒక ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్ధితి ఏంటని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య రోజున తాను జమ్మలమడుగు వెళ్తున్నానని.. ఆ సమయంలో శివప్రకాశ్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు.

Exit mobile version