Vyooham Movie: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్ట్ బ్రేక్ వేసింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేస్తూ తీర్పునిచ్చింది. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ.. మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
రామ్ గోపాల్ వర్మ తరపున సీనియర్ న్యాయవాది ఎంపీ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని వాదిస్తూ, సెన్సార్ బోర్డ్ ఆమోదాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కళాత్మక స్వేచ్ఛ రాజ్యాంగ హక్కని అన్నారు. టీడీపీ తరపు న్యాయవాది మురళీధర్ రావు ‘వ్యుహం’ చిత్రం ప్రతిపక్ష పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుందని, వారిని ప్రతికూలంగా చిత్రీకరించారని తెలిపారు.ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ ల క్యారెక్టర్లను పేర్కొన్నారు. హైకోర్టు తన తీర్పులో అభ్యంతరకర సన్నివేశాలు ఎన్నికలపై సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది, దాని సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేసి జనవరి 11 వరకు విడుదలను నిలిపివేసింది. ఇదిలా ఉంటే, వ్యూహం సినిమా సోనియాగాంధీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందంటూ కాంగ్రెస్ కూడా పిటిషన్‌ను దాఖలు చేసింది. వ్యూహం చిత్రం యొక్క సర్టిఫికేషన్‌ను పునఃసమీక్షించవలసిందిగా కోరింది. ‘వ్యుహం’ రాజకీయ శత్రుత్వాన్ని పెంచుతుందని రామ్ గోపాల్ వర్మను రాష్ట్రం నుండి బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. అజ్మల్ అమీర్, మానస రాధాకృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కావలసి ఉంది.అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చిత్రానికి వ్యతిరేకంగా కోర్టు కెక్కడంతో నిలిచిపోయింది.