Telangana Congress:బీజేపీపై నయవంచన పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. గురు వారం గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ ఈ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 40కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని..గొప్పులు చెప్పే బీజేపీ ఏ ఒక్క పేదవారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా వేయకుండా మోసం చేసిందని అన్నారు . సామాన్యుడు బతకలేని విధంగా భారం వేశారని పిల్లల పెన్సిళ్లు, రబ్బర్ల మీద కూడా జీఎస్టీ భారం వేసిందని పేర్కొన్నారు. 67ఏళ్లలో 14 మంది ప్రధానులు చేసిన అప్పు 55లక్షల కోట్లు కాగా పదేళ్లలో నరేంద్ర మోడీ చేసిన అప్పు 113 లక్షల కోట్లని చెప్పారు.
ఈస్ట్ ఇండియా కంపెనీలా బీజేపీ..(Telangana Congress)
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ సంపద, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందని అన్నారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించి అధికారం చేపట్టేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా బీజేపీ నియంతృత్వ ధోరణి ఉందన్నారు. సంపదను కొన్ని కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.