Tea with Deputy CM: విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గౌరవాధ్యక్షుని హోదాలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరి నివాసంలో 14వ పాలకమండలి సమావేశం నిర్వహించి జూ పార్కుల నిర్వహణ, ఆదాయంపై అధికారులతో చర్చించారు.
జూపార్కులకు ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి పర్యావరణ అనుకూలమైన కార్యక్రమాలను అనుసరించాలని అధికారులను కోరారు. జూ పార్కులను అభివృద్ధి చేయడానికి నిధులను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ ) మోడల్‌లో సేకరించాలి. అలాగే జంతు మార్పిడి కార్యక్రమం కింద అరుదైన ఆకర్షణీయమైన జంతువులను జూ పార్కులకు తీసుకురావాలని అధికారులకు సూచించారు.జూ పార్కులను సందర్శించే సందర్శకులకు ఉత్తమ వన్యప్రాణుల అనుభూతిని అందించే ఏర్పాట్లు చేయండని ఆయన అన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలి. జంతువులను దత్తత తీసుకుని, జూల అభివృద్ధికి విరాళాలు ఇచ్చేలా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. దీనికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను కోరారు. కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను కలుపుకొని ‘టీ విత్ డిప్యూటి సీఎం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. అదనంగా మండలాల వారీగా కొత్త జులాజికల్ పార్కుల ఏర్పాటుకు గల అవకాశాలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు రెండు గంటల సమయం కేటాయించాలని అధికారులను ఆదేశించారు.