Site icon Prime9

Amaravati: టీడీపీ గెలుపుతో అమరావతికి పునర్ వైభవం

Amravati

Amravati

Amaravati: తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో.. అమరావతికి పునర్ వైభవం రానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కలల రాజధాని అమరావతిని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరుగున పడేసింది. దాంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక ముందే.. చెట్టు, ముళ్ల కంపలతో నిండిపోయిన రాజధానిని అధికారులు శుభ్రం చేసే పనిలో పడ్డారు.

పనులు వేగంగా చేయాలని సీఎస్ ఆదేశాలు..(Amaravati)

మరోవైపు కొత్త సీఎస్ సైతం పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో రాజధాని పనులు ఆఘమేఘాల మీద అధికారులు ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు మూడు రోజులుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. 25 ప్రాంతాల్లో 94 పొక్లయిన్లతో 109 కి.మీ. నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

ముళ్లకంపలు తొలగించి..

కరకట్టపై వెలగని విద్యుద్దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మారుస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 లైట్లను మార్చారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రెండు దశల్లో రూ.9.60 కోట్లతో ప్రారంభించిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రాజెక్టును కూడా తాజాగా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి వరకు మొత్తం 9 కి.మీ. మేర ఈ మార్గంలో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు లేవు. ఇవి ముళ్ల పొదలతో నిండిపోయాయి. దాంతో అధికారులు ఆప్రదేశంలో ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్‌మెంట్లు, విట్‌ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, నవులూరులోని ఎంఐజీ లేఔట్, స్టేడియం, శాఖమూరు పార్కు, ఎన్‌ఐడీకి వెళ్లే మార్గాల్లో ముళ్లచెట్లను కూడా తొలగిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది. దాంతో ఇప్పుడు ఆ నిర్మాణాల పటిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు కొత్త ప్రభుత్వం ఇంజినీరింగ్‌ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత పనులు చేపట్టే అవకాశం ఉంది. అమరావతిలో ఆగిపోయిన పనులన్నీ త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు ఏపి సీఎస్ నీరబ్ కుమార్. ఉద్దండరాయునిపాలెంలోని అమరావతి నిర్మాణ శంకుస్థాపన ప్రదేశాన్ని సీఎస్ నీరబ్ కుమార్ పరిశీలించారు. అమరావతి రైతులకు రావాల్సిన రెండేళ్ల కౌలు నగదు…ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి క్లియర్ చేస్తామన్నారు. యుద్ద ప్రాతిపాదికన జంగిల్ క్లియరెన్స్ చేపట్టామన్న ఆయన.. ఈ ప్రాంతంలో 94 జీసీబీలతో జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నాయన్నారు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ కోసం మరిన్ని జేసీబీలు పంపిస్తామని.. చంద్రబాబు సీఎం బాధ్యతల అనంతరం…ఆయన చెప్పింది చేస్తానని తెలిపారు.

అమరావతికి పూర్వ వైభవం | Amaravati Capital Work Restart | Chandrababu | Prime9 News

Exit mobile version
Skip to toolbar