TDP Book on Pinnelli Anarchy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలపై టీడీపీ నేతలు విరుచుకు పడ్డారు . ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదదల చేసారు . ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలు, దోపిడీ విధానాలంటూ ‘పిన్నెల్లి పైశాచికం’ అనే పేరుతో టీడీపీ బుధవారం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం అండ చూసుకొని పిన్నెల్లి పైశాచికత్వం తారస్థాయికి చేరిందని ఆరోపించారు.
విగ్రహాలు దొంగతనం చేసిన దొంగ పిన్నెల్లి..(TDP Book on Pinnelli Anarchy)
పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇసుక నుంచి దేవాలయాల్లో విగ్రహాల దొంగతనం వరుకు దోచేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు . మాచర్లలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. 2009 లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పిన్నెల్లి, అతని సోదరుడు అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో పిన్నెల్లి పైశాచికత్వానికి అంతులేకుండా పోయిందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతను రూ.2 వేల కోట్ల దోపిడి చేశాడని ఆరోపించారు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయన్నారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.