TDP: తెలంగాణ అసెంబ్లీఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి అధిష్టానం నిర్ణయించింది. నిన్న ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. తెలంగాణలో పోటీ చేయాలన్న కార్యకర్తల కోరికని జ్ఞానేశ్వర్ చంద్రబాబుకి వివరించారు.
అయితే ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉంటున్నామో పార్టీ శ్రేణులకి వివరించాలని చంద్రబాబు సూచించారు. దీంతో చేసేదేమీ లేక తెలంగాణలోని కార్యకర్తలకి టిడిపి సీనియర్ నేతలు అధిష్టానం నిర్ణయాన్ని కార్యకర్తలకి వివరిస్తున్నారు. ఎన్నికల రేసు నుండి దూరంగా ఉండాలనే ప్రతిపాదన వెనుక టీడీపీ మార్కు వ్యూహం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోందని టీడీపీ తన సోషల్ మీడియా యంత్రాంగం ద్వారా ప్రచారం చేస్తోంది. హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ ఉద్యోగులు నిరసనలకు కూడా దిగారు. మొదట్లో ఐటీ కారిడార్ లో నిరసనలను తప్పు బట్టిన మంత్రి కేటీఆర్ కూడా తరువాత తన గొంతు సవరించుకున్నారు. తమకు చంద్రబాబు, లోకేష్ అంటే సానుభూతి ఉందని అయితే ధర్నా చౌక్ లో చేసుకోవాలని సూచించారు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పలువురు ప్రజలు హైదరాబాద్ లోని పలు నియోజక వర్గాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే 2018 అసెంబ్లీ , 2020 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వీరు కేసీఆర్ వైపే మొగ్గారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు ప్రజాప్రతినిధులుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా ఉన్నారు. వీరు బాబు అరెస్ట్ ను బహిరంగంగానే ఖండిస్తున్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు.
సెటిలర్లుగా పేర్కొనే ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతింటే వీరిలో ఎక్కువమంది చంద్రబాబు అనుచరుడు ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్ కు మొగ్గు చూపే అవకాశముంది. టీడీపీ కూడా ప్రస్తుత పరిస్దితుల్లో తెలంగాణలో పోటీ చేసి సాధించేదేమి లేదు. ఇలాచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది మరలా బీఆర్ఎస్ కే అనుకూలమవుతుంది. అందువలన సెటిలర్ల ఓట్లను వీలైనంతమేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేలా చేయడమే మేలని టీడీపీ భావిస్తోంది. ఈ ఎన్నికలకు ఖర్చు పెట్టే ఆర్దిక వనరులను మరో ఆరు నెలల్లో ఏపీలో జరిగే ఎన్నికలకు వాడుకోవచ్చన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే తెలంగాణలో పోటీకి దూరమయింది.