Sharmila’s statement: వైఎస్ వివేకా హత్య కేసులో గతనెల 30న ఛార్జిషీటు సమర్పించిన సీబీఐ వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కీలకంగా ప్రస్తావించింది. షర్మిల వాంగ్మూలాన్ని చార్జిషీటులో పొందు పరిచింది. గతేడాది అక్టోబర్ 7న షర్మిల ఢిల్లీలో 29వ సాక్షిగా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. తన వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని షర్మిల చెప్పారు. హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కాదుగానీ .. పెద్దకారణమే ఉందని షర్మిల సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే హత్యకి కారణం కావచ్చని షర్మిల తెలిపారు.
అవినాష్ ఫ్యామిలీ దారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకొని ఉండొచ్చని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు కొన్ని నెలల ముందు వివేకా బెంగళూరులోని తమ ఇంటికొచ్చారని కడప ఎంపీగా పోటీచేయాలని తనని అడిగారని షర్మిల సిబిఐకి వివరించారు. ఎంపీగా అవినాష్ పోటీచేయవద్దని కోరుకుంటున్నట్లు వివేకా తనకి చెప్పారని షర్మిల వెల్లడించారు. అవినాష్‌కు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని జగన్‌ను ఒప్పిద్దామని వివేకా తనతో అన్నారని షర్మిల తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా తాను వెళ్లనని వివేకా ఆలోచించారని షర్మిల అన్నారు.
జగన్‌ను కచ్చితంగా ఒప్పించగలననే ధీమా వివేకా మాటల్లో కనిపించిందని షర్మిల చెప్పారు. జగన్ మద్దతివ్వరని తెలుసు.. అందుకే మొదట తాను పోటీకి ఒప్పుకోలేదని షర్మిల సిబిఐ అధికారులతో అన్నారు. బాబాయి పదేపదే ఒత్తిడి చేయడంతో పోటీకి సరే అన్నానని షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే వివేకానే పోటీ చేయాలనుకోకుండా మీపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని సిబిఐ అధికారులు షర్మిలని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఎంపీగా పోటీకి ఆసక్తి చూపక పోయి ఉండవచ్చని షర్మిల సమాధానం ఇచ్చారు.
ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయమ్మపై వివేకా పోటీ చేశాక కొంత దూరం పెరిగిందని షర్మిల సిబిఐకి తెలిపారు. ఆ కారణంగా ఎలాంటి టికెట్ దక్కకపోవచ్చునని వివేకా భావించారని షర్మిల చెప్పారు. ఎమ్మెల్సీగా వివేకా ఓటమికి అవినాష్, భాస్కర్‌రెడ్డిలాంటి కొందరు సన్నిహితులే కారణమని షర్మిల అన్నారు. కుటుంబంలో అంతా బాగున్నట్లున్నా.. కోల్డ్ వార్ ఉండేదని వైఎస్ షర్మిల వెల్లడించారు.