Punugu Pilli: శ్రీశైలం దేవస్థానంలో స్వామి వారి ఉచిత దర్శనానికి వెళ్లే క్యూలైన్ లో భక్తులకు పునుగు పిల్లి కనిపించింది. ఈ విషయాన్ని ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడి చేరుకున్న సిబ్బంది పునుగు పిల్లిని అక్కడి నుంచి సమీప అడవిలోకి తరలించారు.స్వామి వారి దర్శనం కన్నా ముందు పునుగు పిల్లి దర్శనం అయిందని భక్తులు మాట్లాడుకున్నారు .అంతరించి పోతున్న జీవరాశులు జాబితాలో పునుగు పిల్లి కూడా వుంది . అరుదుగా కనిపించే పునుగు పిల్లిని తమ సెల్‌ఫోన్లతో చిత్రీకరించారు భక్తులు . క్యూలైన్ ఏర్పాటుకు ముందు గతంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా పునుగు పిల్లుల సంచరిస్తుండేవని స్థానికులు చెబుతున్నారు . భక్తుల రద్దీ పెరుగుతుండడంతో క్యూలైన్లను అభివృద్ధి చేశారని, దీంతో పునుగు పిల్లుల జాడ కనుమరుగై పోతూవస్తుందన్నారు.
పునుగు పిల్లి విశిష్టత ఏంటి ? ..(Punugu Pilli)
ప్రపంచ వ్యాప్తంగా వున్న పునుగు పిల్లుల్లో 38 జాతులు ఉన్నాయి. ఆసియా ఖండానికి చెందిన పునుగు పిల్లుల్లో ప్రత్యేక విశిష్టత దాగి ఉంది. దీని శరీరం నుంచి జవ్వాది , పునుగు అనే సుగంధ ద్రవ్యం లభిస్తుంది. వీటిని పవిత్రంగా భావించి దైవారాధనకు వినియోగిస్తారు. పునుగు పిల్లులు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో కనిపిస్తాయి. ఈ పిల్లి నుంచి తీసే తైలాన్ని తిరుమల శ్రీవారి మూల విరాట్టుకు అభిషేకానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది . ప్రతీ పది రోజులకు ఓసారి ఈ పునుగుపిల్లి చర్మంపై బుడిపెల లాంటివి ఏర్పడుతాయి. వాటి నుంచి సువాసన వెదజల్లే తైలం వస్తుంది. అలాగే ఒళ్లు నొప్పులను తగ్గించడంలో ఈ తైలం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం. ఎన్నో ఉపయోగాలున్న ఈ తైలానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కూడా ఉంది.
పునుగుపిల్లి నుంచి తైలం ఎలా తీస్తారు..?
పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. పునుగు పిల్లిని ఇనుప బోను లో బంధిస్తారు. దానికి సమీపంలోనే చందనపు కర్రను నిలబెడతారు. పునుగు పిల్లి ప్రతి పది రోజులకు ఒకసారి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుంది . ఇదంతా పునుగు పిల్లి శరీరంపై కొద్దిగా అట్టలా పేరుకుపోతుంది. దీంతో పిల్లి తన శరీరాన్ని ఇనుప జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు రుద్దుతుంది. ఆ కర్రకు శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా బంకలా అంటుకుపోతోంది. దానని తీసి తైలంగా ఉపయోగిస్తుంటారు.