Prime Minister Modi : ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని నిజామాబాద్ లో పర్యటించనున్నారు. నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం.
ప్రధాని మోదీ బీదర్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2:56 గంటలకు నిజామాబాద్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:45 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4:45 వరకు సభలో ఉంటారు. తరువాత 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్ లోబయలుదేరి బీదర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. నిజామాబాద్ పర్యటన సందర్బంగా ప్రధాని మోదీ తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్లతో నిర్మించిన 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు నిర్మించిన కొత్త రైల్వే లైన్ ను, అలాగే ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్ నగర్-కర్నూల్ వరకు కొత్త లైన్ కు సంబంధించిన విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైలు సర్వీస్ ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు.