Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. అధ్యక్ష మార్పుపై జరుగుతున్న చర్చ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తమ పార్టీలో లీకులకు తావుండదని బండి సంజయ్ అన్నారు. గతంలో ఎప్పుడూ అలా జరిగిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర మంత్రి పదవి ఎవరికైనా దక్కినప్పుడు వారి పేర్లు బయటకు వచ్చాయా?.. రాష్ట్ర పదవి ఇచ్చినప్పుడు ఎవరి పేర్లయినా బయటపడ్డాయా? అని ప్రశ్నించారు. అధిష్టానం ఏ నిర్ణయం ప్రకటించినా కట్టుబడి పని చేస్తానన్నారు. పార్టీ ఎక్కడ పనిచేయమన్నా తాను సిద్ధమని.. ఏ పని చేయొద్దని, ఇంట్లో కూర్చోమని చెప్పినా కూర్చుంటానన్నారు. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉంటానని తెలిపారు.
తమకు బీఆర్ఎస్‌తోనే పోటీ అని.. కాంగ్రెస్‌తో కాదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఆ పార్టీకి హుజురాబాద్‌లో అభ్యర్థి కూడా లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అతీగతీ లేదని సెటైర్లు వేశారు. తమ పార్టీ నుంచి కూడా కొందరు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోందన్నారు. వెళ్లే వాళ్లు వెళ్తారు.. ఉండేవారు ఉంటారు.. తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తామన్నారు. కేసీఆర్ చేయించుకున్న సర్వేలో బీజేపీకి ఆదరణ పెరిగిందని తేలిందన్నారు బండి సంజయ్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే చెప్పిందన్నారు.
అందుకే బీజేపీకి భయపడి కాంగ్రెస్‌ను జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ప్రజలు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు పది మంది కూడా లేరని కామెంట్లు చేశారన్నారు. కానీ 48 స్థానాలు గెలిచి తమ సత్తా చాటామన్నారు. కమలం పువ్వు గుర్తుతోనే ప్రజల్లోకి వెళ్తామన్నారు. జాయినింగ్స్ కోసం ఎవరో వస్తారని ఎదురుచూడమన్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.
కవితపై ఈడీ, సీబీఐ విచారణ జరుగుతోందని బండి సంజయ్ తెలిపారు. ఆధారాలు సేకరిస్తున్నారని.. దొంగలు ఎవరైనా మోడీ సర్కారులో తప్పించుకోలేరన్నారు. చార్జిషీట్‌లో కవిత పేరు లేకుంటే బీజేపీకి, బీఆర్ఎస్‌కు మధ్య ఒప్పందం కుదరినట్లా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు చేసిన వారు కాస్త ఆలస్యమైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.