Gandhi Bhavan Posters: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్దులకు టికెట్ల ఖరారు ప్రక్రియ తుది దశకి చేరుకుంటోంది. ఈ సందర్బంగా తమకి లేకపోయినా ఫర్వాలేదు ప్రత్యర్థులకి మాత్రం టికెట్ దక్కకూడదంటూ కాంగ్రెస్ నేతలు ఎత్తులు వేయడం ప్రారంభించారు.
దానిలో భాగంగానే పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్‌కి వ్యతిరేకంగా ఏకంగా గాంధీ భవన్‌లోనే పోస్టర్లు అంటించారు. హైదరాబాద్ శివార్లలోని ఎల్‌బి నగర్ అసెంబ్లీ స్థానంనుంచి మధు యాష్కీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో కంగారు పడ్డ ప్రత్యర్థులు సేవ్ ఎల్‌బి నగర్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు అంటించారు. గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ పోస్టర్లు అంటించారు. పారాచూట్ నేతలకి టికెట్స్ ఇవ్వద్దంటూ పోస్టర్లలో రాశారు.
నేటి నుంచి స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు..(Gandhi Bhavan Posters)
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును వేగవంతం చేసింది. నేటి నుంచి టి.పీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో టి.పీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలో అభిప్రాయ సేకరణ చేపట్టనుంది కమిటీ. ఇదిలా ఉండగా..రేపు డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలతో పాటు మాజీ మంత్రులతో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకానుంది.