Police: వ్యభిచార గృహంలో పోలీసుల ఓవరాక్షన్

తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ.

  • Written By:
  • Updated On - December 14, 2022 / 03:51 PM IST

Police Overaction: తప్పు చేస్తే పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం, న్యాయస్థానాల్లో హాజరుపర్చడం వరకే పోలీసుల డ్యూటీ. కానీ కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఓవరాక్షన్ చేస్తుంటారు. నిందితులనే కాదు బాధితులతోనూ అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం, దుర్భాలాడటం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం… ఇలా పోలీసుల అతిగా వ్యవహరించిన అనేక ఘటనలు వెలుగుచూసాయి. తాజాగా కృష్ణా జిల్లా పోలీసులు కొందరు మహిళలతో వ్యవహరించి తీరు, మాట్లాడిన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా వున్నాయి. ఆ మహిళలు తప్పు చేసి వుండవచ్చు… కానీ వారితో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా వుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉయ్యురు మండలం ఆకునూరు గ్రామంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఉయ్యురు పోలీసులు. ఈ సందర్భంగా ఓ పోలీసు చేతిలో పేక ముక్కలు ఆడిస్తూ దర్జాగా ఇంట్లో కుర్చీలో కూర్చుని యువతులను బెదిరించాడు. నైటీలు మార్చుకుని వస్తావా..ఇలానే కొట్టుకుంటూ తీసుకువెళ్లనా అంటూ అసభ్యంగా మాట్లాడారని యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ కానిస్టేబుల్ కాకుండా మగ పోలీసులు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపించారు.