Harirama Jogaiah: నవంబర్ 1వ తేదీకల్లా పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేస్తాం.. చేగొండి హరిరామజోగయ్య

రాబోయే పదేళ్ళలో రాబోయే ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్ధారించగలగాలో, ప్రజల అభీష్టమేమిటో అర్థం చేసుకుని పీపుల్స్ మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీకల్లా తయారు చేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 03:01 PM IST

Harirama Jogaiah: రాబోయే పదేళ్ళలో రాబోయే ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్ధారించగలగాలో, ప్రజల అభీష్టమేమిటో అర్థం చేసుకుని పీపుల్స్ మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీకల్లా తయారు చేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు. ఈ మేనిఫెస్టోని పరిశీలించి జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్పించటం ద్వారా ప్రజానీకానికి తగిన భరోసా ఇవ్వాలని జోగయ్య అన్నారు.

పూర్తి వివరాలతో కూడిన పీపుల్స్ మేనిఫిస్టోను పవన్ కల్యాణ్‌కి నవంబరు మొదటివారంలో అందచేస్తామని జోగయ్య తెలిపారు. తాము ప్రతిపాదించే సంక్షేమ పథకాలన్నీ తెల్లకార్డుల కుటుంబాల వారికే వర్తింప చేయాలని జోగయ్య అన్నారు. వివిధ పథకాలు, రిజర్వేషన్లు అర్హులకి అందేలా కులగణన చేబట్టి జనాభా వివరాలు రాబట్టి, త్వరితగతిన పూర్తిచేయాలనేది పీపుల్స్ మేనిఫెస్టో కమిటీ సంకల్పమని జోగయ్య వివరించారు. వివిధ పన్నుల వసూలు లీకేజీలను అరికట్టటం ద్వారాను సంపద సృష్టించాలని కాపు సంక్షేమ సేన కోరుతోంది. తద్వారా సమకూరే నిధులను పేదల సంక్షేమానికి ఖర్చుపెట్టాలని కాపు సంక్షేమ సేన ప్రతిపాదించింది. సంక్షేమంతో సమానంగా రాష్ట్రాభివృద్ధికి బడ్జెట్టు ప్రతిపాదనలు ఉండేలా చూడటం తమ అభిమతమని కాపు సంక్షేమ సేన తెలిపింది,

అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉన్న అమరావతినే పరిపాలన రాజధానిగా కొనసాగించాలని కాపు సంక్షమే సేన డిమాండ్ చేసింది. ఐతే అమరావతిలోనే అభివృద్ధి అంతా కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి వికేంద్రీకరించాలని కాపు సంక్షేమ సేన కోరుతోంది. 2024 సంవత్సరంలో అధికారం కైవసం చేసుకోవటంతోపాటు నీతివంతమైన, ఎటువంటి కుల పిచ్చిలేని, పేదరిక నిర్మూలనతో సమ సమాజంతోకూడిన రాష్ట్రాభివృద్ధి కోరే సమర్ధవంతమైన సుస్థిర పరిపాలన అందిండమే అంతిమ లక్ష్యంగా ఈ మేనిఫెస్టో తయారు చేస్తున్నామని జోగయ్య వివరించారు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..(Harirama Jogaiah)

తెల్లకార్డు కలిగిన కుటుంబాలలోని వ్యక్తి ఒకరికీ ప్రతినెలా 6 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించారు. కూరగాయలు, పప్పులు తదితర నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు, నెలకి ఒక గ్యాస్ సిలిండర్ కొనడానికి, పిల్లల చదువుకి వైద్య ఖర్చులకి నెలకొక ఐదు వేల రూపాయలు మహిళా కుటుంబ పెద్ద బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని కాపు సంక్షేమ సేన ప్రతిపాదించింది. కుటుంబంలో ఉన్న అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందచేయాలని మేనిఫెస్టోలో సూచించారు.అర్హులైన కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల మేర జీవిత బీమాని ప్రభుత్వమే ప్రీమియ చెల్లించి అందించాలని కాపు సంక్షేమ సేన సూచిస్తోంది. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల పేర పెళ్ళికానుకగా బ్యాంకు ఖాతాలో 3లక్షల రూపాయిలు డిపాజిట్టు చేయాలని, ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు ఫీజ్ రియంబర్సుమెంటు ద్వారా ఉచిత విద్య అందించాలని కాపు సంక్షేమ సేన సూచిస్తోంది. విద్యార్థులందరికీ ఉచిత బస్, రైలు పాసులు అందజేయాలని, స్కూలు విద్యార్థినులందరకీ ఉచితంగా సైకిళ్ళు ఇవ్వాలని కాపు సంక్షేమ సేన మేనిఫెస్టోలో పేర్కొంది.

18 సంవత్సరాలు దాటిన విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలివ్వాలని, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కాపు సంక్షేమ సేన ప్రతిపాదించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సంవత్సరానికి 100మంది నిరుద్యోగులకు, అయిదేళ్ళలో తెల్లకార్డు ఉన్న 500 మందికి ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయలు చేయూతగా ఇవ్వాలని కాపు సంక్షేమ సేన సూచించింది.

రైతులందరికీ ఉచిత పంటల భీమా పథకం వర్తింప చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు పంట సీజను ముందే మద్దతు ధర ప్రకటించి అమలు చేయాలని కాపు సంక్షేమ సేన సలహా ఇచ్చింది. 5 ఎకరాల పల్లం 10 ఎకరాలలోపు మెట్ట ఉన్న రైతు ప్రతి కుటుంబానికి రైతు బంధు పథకం క్రింద వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ప్రతి సంవత్సరం 20వేలు రూపాయలు గ్రాంటుగా మంజూరు చేయాలని కాపు సంక్షేమ సేన మినీ మేనిఫెస్టోలో కోరింది. బి.సి., ఎస్.సి., ఎస్.టి. సప్లైన్స్ పారదర్శకంగా అమలు చేయాలని కాపు సంక్షేమ సేన ప్రతిపాదించింది.