Pawan Kalyan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 8మంది అభ్యర్థులకి జనసేనాని పవన్ కళ్యాణ్ బి ఫాంలని అందజేశారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ పొత్తులో భాగంగా.. జనసేనకు 8 సీట్లను కూడా బీజేపీ కేటాయించింది. అయితే.. ఆ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను జనసేన అధిష్టానం ప్రకటించింది.
బి ఫాంలని అందుకున్నవారు వీరే.. (Pawan Kalyan)
బి ఫాంలని అందుకున్నవారిలో కూకట్‌పల్లినుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కోదాడనుంచి మేకల సతీష్‌రెడ్డి, తాండూరునుంచి నేమూరి శంకర్‌గౌడ్, ఖమ్మంనుంచి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెంనుంచి లక్కినేని సురేందర్‌రావు, అశ్వారావుపేట ఎస్టీ నియోజకవర్గంనుంచి ముయబోయిన ఉమాదేవి, వైరా ఎస్టీ నియోజకవర్గంనుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, నాగర్ కర్నూల్‌నుంచి వంగల లక్ష్మణ్ గౌడ్ జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.తెలంగాణలో ఇప్పటికే నాలుగు విడతల్లో బీజేపీ 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. పొత్తు పెట్టుకున్న జనసేనకు ఇచ్చిన 8 సీట్లతో కలిపి.. ఇప్పటివరకు మొత్తం 108 స్థానాలకు కూటమి అభ్యర్థులు ఖరారైనట్టయింది.
బీజేపీ జనసేన కూటమి తరపు మిగిలిన స్థానాలకు టికెట్లు కేటాయించాల్సి ఉంది. మరోవైపు.. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి సీటు విషయంలో సందేహం నెలకొంది. శేరిలింగంపల్లి స్థానాన్ని తమకు కేటాయించాలని జనసేన పట్టుపడుతోంది.. ఇటు బీజేపీ నేతలు కూడా శేరిలింగంపల్లిని వదలుకునేందుకు ఒప్పుకోవటంలేదు. నామినేషన్లకు ఇంకా రెండు రోజులే సమయం మిగిలి ఉంది.. ఈ నేపధ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.