Chandrababu Naidu: రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిలా్ల పోలేపల్లి వద్ద బుధవారం రాత్రి యువగళం- నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
గంజాయి రాజధానిగా విశాఖ..(Chandrababu Naidu)
వైసీపీ పాలనలో ఉత్దరాంధ్రలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఆర్దిక రాజధానిగా ఉన్న విశాఖ నేడు గంజాయి రాజధానిగా మారిందన్నారు. వైసీపీ నేతల కబ్జాల్లో ఉత్తరాంధ్ర నలిగిపోయిందన్నారు. రుషికొండను బోడిగుండుగా మార్చి సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. మూడుముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసారని అన్నారు. వైసీపీ పాలనలో కంపెనీలు పారిపోతున్నాయని ఉపాధి అవకాశాలు దొరకని పరిస్దితులు ఏర్పడ్దాయని ఆవేదన వ్యక్తం చేసారు.పోలీసులను అడ్డుపెట్టుకుని లోకేశ్ పాదయాత్రపై దండయాత్ర చేసారని దీనికి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. పాదయాత్రలో వాలంటీర్ల సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అని వారు కేసులబారిన కూడా పడ్డారని అన్నారు. త్వరలో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. బీసీ ల రక్షణ కోసం చట్టాన్ని తీసుకు వస్తామని అగ్రవర్ణాల పేదలను ఆదుకుంటామని చెప్పారు. 20 లక్షలమందికి ఉపాధికల్పన కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు.