Nadendla Manohar: కృష్ణా డెల్టాలో ఎండిపోతున్న పంటలు చూసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి ప్రణాళిక లేకపోవటం వల్లే రాష్ట్రంలో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్ళాలో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలకి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ఏర్పడటానికి సీఎం జగనే కారణమని విమర్శించారు. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదని అందువలనే వ్యవసాయం, పరిశ్రమలు కుదేలైపోయాయని ఆరోపించారు. విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటు చేసింది శాటిలైట్ కార్యాలయమేనని అయితే సీఎం తన వల్లే కంపెనీ వచ్చినట్లు గొప్పలకు పోతున్నారని అన్నారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలతో పరిశ్రమలు కుదేలు అవుతున్నాయని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేసారు.