Mudragada Padmanabham: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను విడుదల చేశారు. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడిపై కానీ.. ఒక వేళ అక్కడి నుంచి కాకపోతే.. పిఠాపురం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు.
జనసైనికులు తిట్టడంతో తనలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందని.. అందువల్లే ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు పోతుందని ఆ విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. కాపు ఉద్యమ సమయంలో పోలీసులు నా కుటుంబ సభ్యులను కొట్టినప్పుడు మీరు ఏమై పోయారని ప్రశ్నించారు.మీరు, మీ జనసైనికులు నన్ను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషంగా ఉందని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. మీ బెదిరింపులకు భయపడి నేను లొంగుబాటుకు రానని అన్నారు.
గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారు. దమ్ముంటే మీరు నన్ను నేరుగా తిట్టండి. నేను మీ బానిసను కాదు మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదు. మీరు సినిమాల్లోనే హీరో చరాజకీయాల్లో హీరో కాదని గ్రహించాలని ముద్రగడ అన్నారు. నేను మీ వద్ద నౌకరి చేయడం లేదు.. మీకు తొత్తుగా ఉండాలా.? గతంలో ఉద్యమంలో అరెస్ట్ అయిన వారిని ఎవరిని అయినా పరామర్శించారా? 2016 నుంచి పెట్టిన కేసులు జగన్ తీసివేసిన సంగతి తెలుసా? అంటూ ముద్రగడ తన లేఖలో పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.