Site icon Prime9

Mocha Cyclone : ప్రజలారా బీ కేర్ ఫుల్.. తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న మోచా ముప్పు..

mocha cyclone alert in ap and telangana states

mocha cyclone alert in ap and telangana states

Mocha Cyclone : తెలుగు రాష్ట్రాలను వానలు వదిలేలా కనిపించడం లేదు. ఒక వైపు భానుడి భాగభగలు ఉంటూనే మరోవైపు.. వానలు కూడా దంచికొడుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణాల్లో ఇప్పటికే వర్షాలు దుమ్ములేపుతుండగా.. మరో రెండు, మూడు రోజుల పాటు మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తుంది.  ఆదివారం రాష్ట్రంలో అల్లూరి, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది కాస్తా ఆదివారం ( మే 7 ) అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉండగా.. సోమవారం(మే 8) నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారనుంది. అది కాస్తా.. ఎల్లుండి లోగా వాయు గుండంగా మారి విజృంభించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ తుపానుకు మోచా అని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. ఇది పశ్చిమ బెంగాల్, మయన్మార్‌ల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. తూర్పు తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఒడిశాకు తుపాన్ ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం తీరప్రాంత జిల్లాలను అలెర్ట్‌ చేసింది.

ఇక మోచా తుఫాన్.. ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ తుఫాను ముప్పు ఏపీకి ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం సహాయం, సమాచారం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు అధికారులు.

మరో వైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షంతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.

 

Exit mobile version