Alla Ramakrishna Reddy: వైఎస్ఆర్‌సిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టేశారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి మంగళగిరికి, తనకి అన్యాయం చేశారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసిపిలోకి మళ్లీ వెళ్ళే ప్రసక్తి లేదని, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటానని ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరి కుప్పం గాజువాక భీమవరంలాంటి నియోజకవర్గాల్లో వైసిపి గెలవాలి అంటే ఆ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి చేయాలో అంత చేయలేదని ఈ పరిస్థితుల్లో మళ్ళీ అక్కడ ఎలా గెలిపిస్తారని ఆళ్ళ ప్రశ్నించారు. తన సొంత నిధులు వెచ్చించి కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. 8 కోట్ల రూపాయాలు అప్పు చేసి కాంట్రాక్టర్లకు ఇచ్చానని చెప్పారు. నిధుల గురించి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. మంగళగిరిలో 50 ఏళ్లలో జరగని అభివృద్దిని నాలుగేళ్లలో చేసి చూపించానని అన్నారు. లోకేశ్ ను ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానని అన్నారు. వైసీపీ సర్కార్ తప్పు చేస్తే కేసులు వేసేందుకు వెనకాడనని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు.