Telangana: మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదు. వీటన్నింటికి కారణం సొంతరాష్ట్రం ఏర్పాటుకావడమేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయంగా పేర్కొన్నారు.ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్ సీట్లు, ఇంజినీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం నేడు ఎనిమిది వైద్యకళాశాలలు ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు.
స్వరాష్ట్ర ఏర్పాటుతో ఉద్యమకారులుగా పని చేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలనా సారథ్యం స్వీకరించడం, అందులో ప్రముఖ ఉద్యమకారుడు, మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూర్వమైనదని కేసీఆర్ కొనియాడారు.. గతంలో 850 మెడికల్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉండేవి. ప్రస్తుతం వీటిసంఖ్య 2,790 కు పెరిగింది.
పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో పోలిస్తే గణనీయంగా పెంచుకోగలిగాం. గతంలో కేవలంలో రాష్ట్రంలో 515 పీజీ సీట్లు ఉంటే ఇప్పుడు 1180 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే ప్రస్తుతం 152 వరకు అందుబాటులోకి వచ్చాయి. సీట్ల పెంపుతో విద్యార్థులకు మంచి అవకాశం దొరుకుతున్నాయని కేసీఆర్ అన్నారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ఈ కొత్త వైద్యకళాశాలలు ప్రారంభమయ్యాయి.