MP Balashauri: ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
పేర్నినానితో విబేధాలు..(MP Balashauri)
బాలశౌరి గత కొంతకాలంగా మచిలీపట్నం నియోజకవర్గంతోకూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తన స్థానంలో వేరొకరిని లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నారని బాలశౌరి కినుక వహించారు. అలాగే స్థానిక నేతల వైఖరితోకూడా బాలశౌరి విసిగిపోయారు. రాజీనామా లేఖని సిఎం వైఎస్ జగన్‌కి ఎంపి బాలశౌరి పంపించారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాల శౌరి చాలా కాలంగా విబేధిస్తున్నారు. కొంతకాలం కిందట మచిలీపట్టణంలో బాలశౌరి పర్యటనను పేర్ని నాని వర్గీయులు అడ్డుకున్నారు. అప్పటినుంచి ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలు ఢీ అంటే ఢీ అన్నాయి. వైసీపీ పెద్దలు కూడా వారి మధ్య రాజీ కుదర్చలేక పోయారు. బాలశౌరి 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2014 లో గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో ఓడపోయారు. 2019లో మచిలీ పట్టణం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ది కొనకళ్ల నారాయణరావు పై విజయం సాధించారు.