KTR: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలకి పోటీగా రేపు స్వేద పత్రాన్ని విడుదల చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం .. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని కేటీఆర్ అన్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమని కెటిఆర్ హెచ్చరించారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమని, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోమని కెటిఆర్ స్పష్టం చేశారు. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు స్వేద పత్రాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విడుదల చేస్తున్నామని కేటీఆర్ వివరించారు.