Korutla Deepti Murder case: కోరుట్ల యువతి దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. చెల్లి చందనను హంతకురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ప్రియుడు షేక్ ఉమర్ సుల్తాన్‌తో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది.
దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నాలుగేళ్ల కిందట హైదరాబాద్మ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన చందనకు అక్కడ ఉమర్ పరిచయమయ్యాడు. అది క్రమేపీ ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే గత నెల 19న ఉమర్ చందన వద్దకు వచ్చి లైఫ్ లో ఇంకా సెటిల్ కాలేదని అందువలన పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలని అన్నాడు. దీనితో తల్లిదండ్రులు లేని రోజు అక్క దీప్తికి మద్యం తాగించి., ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో ప్రియుడితో పారిపోవాలని అనుకుంది. పధకం ప్రకారం ఆగష్టు 28న ఉమర్ కోరుట్లకు వచ్చాడు. ఆరోజు రాత్రి వోడ్కా తాగి అక్కా చెల్లెళ్లు ఇద్దరూ పడుకున్నారు. తరువాత చందన, ఉమర్ ఇంట్లో బీరువాలో ఉన్న నగదు, బంగారం తీస్తుండగా దీప్తి లేచి అడ్డుకుంది. ఆవేశానికి లోనైన చందన, ఉమర్ దీప్తి మూతికి ప్లాస్టర్ చుట్టి చంపేసారని పోలీసులు తెలిపారు. తర్వాత ప్లాస్టర్ తీసేసి లక్షా ఇరవై వేల నగదు, డెభ్భై తులాల బంగారంతో పరారయ్యారు. మతాంతర వివాహం చేసుకోవాలనుకోవడం, దానికి చందన కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడమే ఈ ఘటనకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు.వీరిద్దరిని ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.