Komatireddy Rajagopal Reddy: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే.
విశ్వసనీయ సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఢిల్లీ లో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో రాజ్‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో మాట్లాడారు. కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలననుంచి తెలంగాణను విముక్తి చేయాలనే తన ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నానని రాజీనామా లేఖలో రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోందని రాజగోపాల్ రెడ్డి వివరించారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయిన తరువాత రాజగోపాలరెడ్డికి బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదు. దీనితో ఆయన గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీనికి తోడు బీజేపీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్దుల జాబితాలో ఆయన పేరుకూడా లేదు. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవినుంచి తప్పించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పలు సందర్బాల్లో చెప్పారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలాకాలంనుంచి ఆయనతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ కి పెద్దగా అవకాశాలు లేవన్న వార్తల నేపధ్యంలో ఆయన చివరకు కాంగ్రెస్ లో చేరాలని డిసైడయినట్లు సమాచారం.