Janasena chief Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత వచ్చేది జనసేన – తెలుగుదేశం ప్రభుత్వమేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి నాల్గవ విడత యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం అవనిగడ్డ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ సీఎం జగన్ కురుక్షేత్ర యుద్దం అన్నారు. వైసీపీ వారు 100మందికి పైగా ఉన్నారు. అందుకే వారిని కౌరవులు అంటున్నాను. మీరు ఓడిపోవడం ఖాయం. మేము గెలవడం ఖాయం. మెగా డీఎస్సీకి అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం అని స్పష్టం చేసారు.
డబ్బు మీద మమకారం లేదు..(Janasena chief Pawan Kalyan)
ఈ పెద్దమనిషి మద్యపాన నిషేధం నుంచి మెగా డీఎస్సీ వరకూ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. యాబైవేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్షలకోట్లు, కిరాయి సైన్యం ఉన్న వారితో పోరాడుతున్నాము. అలాంటి వారితో పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్నాడంటే అది నా నైతికబలం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారి రుణం తీర్చుకుంటామని అన్నారు. యువతకు ద్రోహం చేసారు. వాళ్లను అధికారంలోనుంచి దించడమే జనసేన లక్ష్యం. రాబోయే ప్రభుత్వం జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ పాలన అద్బుతంగా ఉంటే జనసేన వారాహి యాత్రకు ఇంత స్పందన ఉండదు. నాకు రోడ్లపై రావలసిన అవసరం ఉండదు. ప్రత్యేక హాదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అన్నారనే ప్రధాని మోదీ, టీడీపీలతో విబేధించాను. ఓటు చీలిపోకూడదనే నేను అడుగులు వేస్తున్నాను అంటూ పవన్ స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యం బలం గుర్తించకపోతే మనం బలహీనులుగానే ఉండిపోతాము. నాకు నేలమీద, డబ్బుమీద మమకారం లేదు. ఉంటే మాదాపూర్ లో పది ఎకరాలు కొని పెట్టుకునేవాడిని. కాని ఈ వైసీపీ సన్నాసులు నేను డబ్బు తీసుకున్నానని మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ వచ్చిన కాలంలో పరిస్దితులు వేరు. రెండే పార్టీలు ఉన్నాయి. ఎన్టీఆర్ కు కుదిరినట్లు రాజకీయం ఇపుడే సాధ్యంకాదని పవన్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రైతుల పంటలకు సరిగా నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. అన్నం పెట్టే రైతు అంటే నాకు ఎంతో గౌరవం. అందుకే కౌలు రైతులకు నా వంతుగా లక్షరూపాయల చొప్పున ఆర్దికసాయం చేసాను. లాస్ట్ టైమ్ యువత జగన్ ను గుడ్డిగా నమ్మి ఓటేసారు. కాని యువతను, ఉద్యోగులను అందరినీ మోసం చేసారు. 5నుంచి 10 ఏళ్ల మద్య ఉన్న 72 వేల మంది చిన్నారులు చనిపోయారు. 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారు. జగన్ సర్కారు దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తాను..
ఇంత స్టార్ డమ్ ఉండి అంత ఓటమిని తీసుకున్నానంటే నాకు ఈ నేలమీద అభిమానం. అందుకే ఈ సారి మిమ్నిల్ని అడుగుతున్నాను జనసేన, టీడీపీలకు ఓటేయమని. నా సినిమాలు ఆపితే ఆపుకో. నా డబ్బులు ఆపితే ఆపుకో. నామీద కేసులుపెట్టుకో. తప్పు జరిగితే కామ్ గా ఉండను. భగత్ సింగ్, పింగళి వెంకయ్యల వారసులం. ఇంతవరకూ నువ్వు రాజకీయనాయకులతో పెట్టుకున్నావు. దేశాన్ని ప్రేమించే వారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దువుగాని అన్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుకతవ్వకాల వల్ల 76 మంది చనిపోయారు. నేను అసెంబ్లీలో ఉంటే ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉండేది. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే మరో 20 ఏళ్లు నష్టపోతారు. దేవుడు లేని ఊళ్లో మంచం కోడే పోతురాజు.విలువల్లేని వారు ఎమ్మెల్యేలు అయ్యారు. మనిషి గుణం, ప్రతిభను చూస్తాను కాని కులాన్ని చూడను. నా అభిమానుల్లో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు వారు ఉన్నారు.వైసీపీ మహమ్మారికి టీడీపీ.. జనసేన వ్యాక్సిన్ మందు. గొంతు దాహం తీర్చేది జనసేన గ్లాసు.. ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకువెళ్లేది టీడీపీ సైకిల్.. వైసీపీ ప్యాను తిరగదు. వేద్దామంటే కరెంట్ చార్జీల భయం అని పవన్ చమత్కరించారు. వచ్చే ఎన్నికలకు జనసేన, టీడీపీ కలిసే వెడతాయి..ఇందులో మరో సందేహం లేదు. నన్ను కాపు నాయకులతోనే తిట్టిస్తారు. మనుషులను తిట్టే వ్యక్తుల కులాలను చూడను. వ్యక్తులను మాత్రమే చూస్తాను. జగన్ నువ్వు కొంచెం మెచ్యూర్డుగా ఉండు. యువత భవిష్యత్తు కోసమే నేను ఇక్కడే వున్నాను. భవిష్యత్తులో మరోసారి వైసీపీ ని రాకుండా చేయడమే మన కర్త్యవ్యం. జనసేన,టీడీపీలకు మీరు అండగా ఉంటే మీకోసం గొడవ పడే వ్యక్తిని. సీఎం పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తాను. జనసేన కార్యకర్తల మీద కేసులు పెట్టేముందు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు వైసీపీ నేతలు మరోసారి ఆలోచించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక మిమల్ని క్షమించేది నేనే అని పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్పేనని పవన్ అన్నారు.