Rushikonda: ఏపీలో రుషికొండ మహల్ హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖలో నివాసముంటాననుకున్న మాజీ సీఎం జగన్ ఇంటి ఆర్భాటాలు విస్మయపరుస్తున్నాయి. ఇదేదో సాదాసీదా భవనం కాదు. 500 కోట్లతో రుషికొండపై కట్టుకున్న అత్యంత ఖరీదైన ప్యాలెస్. ఫైవ్‌స్టార్ హోటల్, సీఎం క్యాంప్ ఆఫీస్, టూరిజం ప్రాజెక్ట్, ఫేజ్ 1, 2 అంటూ నాటి నాయకులు కాకమ్మ కథలు చెప్పారు. రుషికొండపై జనం సొమ్ముతో జగన్ కట్టుకున్న జల్సా మహల్ గుట్టు బయటపడింది. నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్ ను ఆదివారం టీడీపీ నేతలు సందర్శించారు. అందులో అడుగుపెట్టినవారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహ అలంకరణ వస్తువులు, తళుక్కుమనే ఫ్లోరింగ్, నిర్మాణాలు చూస్తే ఆశ్చర్యపోయారు.
అత్యంత విలాసవంతంగా ..(Rushikonda)
జగన్ వాడుకోవడానికి బిగించిన టాయ్‌లెట్ కమోడ్ ధర కేవలం 13న్నర లక్షలు. జగన్ ఆయన కుటుంబసభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి మూడు బిగించారు. మిగతా బాత్‌రూముల్లో బిగించిన కమోడ్‌ల ధర ఒక్కోటి జస్ట్ 6 లక్షలు. ఇంటీరియర్ డిజైన్ కు 19.5 కోట్లు ఖర్చు చేశారు. రాజసౌధంలో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి, ఏ మూలన ఏ కళాఖండం పెట్టాలనే ఇంటీరియర్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆలోచించని జగన్, తన రాజసౌధానికి మాత్రం ఏ హంగూ తగ్గకుండా చూసుకున్నారు ఇదంతా కూడా జనం సొమ్మే.
రుషికొండ ప్యాలెస్ లో ఎటుచూసినా ధగధగలే. వీటన్నింటిని తలదన్నేలా సీలింగ్ మిలామిలా మెరిసిపోతోంది. సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లియర్లతో నిండిపోయింది. జగన్ నివాసం ఉండాలనుకున్న బ్లాక్‌లో మొత్తం 7 షాండ్లియర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి 15 లక్షలు ఖర్చు చేశారు. భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు సపరేటే. నీటిసరఫరా, కరెంటు, సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు 28 కోట్లు. ఇదంతా ప్రభుత్వ ఖాతానే. పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కూలీలకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచే కూలీ డబ్బులు చెల్లించారు. జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్‌లో సోఫాలు, బల్లలు, కుర్చీలు, టేబుళ్ల వంటి ఫర్నిచర్ కోసం 14 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయాక అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు డబ్బులు పంచినా వారంతా ఓట్లేయలేదంటూ వాపోయిన జగన్ జనాల జేబుల్లో నుంచి లాక్కుని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకున్నారు. నాఎస్సీలు, నాఎస్టీలు, నాబీసీలు, నా మైనార్టీలంటూ వాగ్భానాలు పలికిన జగన్ మరి వీటి ఖర్చును ఏనాడు బయటకు పొక్కనివ్వలేదు. భవనంలో అడుగుపెడితే పాలరాతి చలువవలే ఉండే విధంగా డిజైన్ చేశారు. భవనమంతా సెంట్రలైజ్డ్ ఏసీ చేయించారు. ఎక్కడ చూసినా ఫ్యాన్లే. ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు కనిపించాయి. ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఒక్కో ఫ్యాన్ కు జగన్ అక్షరాల ఖర్చుచేసింది 3 లక్షలు. ఇలాంటి ఫ్యాన్లు రాజమహాల్ లో అనేకం ఉన్నాయి.
రుషికొండ నిర్మాణం పర్యాటకులకోసమేనని నాటి మంత్రి రోజా అవాస్తవాలు చెప్పారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి అవసరమైన భవనాల ఎంపిక కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రుషికొండ భవనాన్ని సందర్శించింది. ఇది జగన్‌కు బాగుంటుందని భవనాలను పరిశీలించిన కమిటీ సూచించిందని రోజా నాడు చెప్పుకొచ్చారు. జగన్ అంగీకరిస్తే క్యాంపు కార్యాలయంగా ఇచ్చేస్తామని ప్రకటించారు. ఆ భవనాన్ని జగన్ నివసించడానికి వీలుగా విలాసవంతంగా నిర్మించుకున్నారని బయటపడింది. అలా జగన్ కోసం అంటే జనాలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయని భావించిన నాటి సర్కార్ కమిటీపై తోసేసింది.
నీటి సరఫరా కోసం వంద కిలోలీటర్ల డొమెస్టిక్ సంప్, మరో 150 కిలోలీటర్లతో ఫైర్ సంప్, వ్యర్థ జలాల శుద్ధికి 100 కేఎల్‌డీ సూయిజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్మించారు. విద్యుత్ సరఫరా కోసం కంటెయినర్ సబ్‌స్టేషన్, ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ, వెయ్యి కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, 100 కేవీఏ సామర్థ్యం కలిగిన మూడు జనరేటర్లు ఏర్పాటు చేశారు.ఇంటికి ఏ వైపున ఏ చెట్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి, ఇంట్లో కిటీకీలో నుంచి చూస్తే వ్యూ ఎంత ఆహ్లాదంగా కనిపించాలనే విధంగా తయారు చేశారు. ఖరీదైన మొక్కలు నాటి గార్డెన్‌ను విలాసవంతంగా తీర్చిదిద్దారు. దీనికి 22 కోట్లు ఖర్చుచేశారు.
407 కోట్లు ఖర్చు..
రుషికొండపై భవనాలకు 452 కోట్ల అంచనా వ్యయంతో 407 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టేశారు. అవన్నీ సర్వ హంగులు, ఖరీదైన అంతర్గత అలంకరణలతో ఇప్పటికే సిద్ధమైపోయాయి. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ కూడా చాలా వరకు తెచ్చేశారు. మళ్లీ తానే గెలుస్తానని, ముఖ్యమంత్రిగా 30 ఏళ్లపాటు తానే ఉంటానని జగన్ కలలుగన్నారు. అవన్నీ కల్లలైపోయాయి. రాజధానిని విశాఖకు మార్చేసి, రుషికొండపై కొలువు తీరాలనుకున్న జగన్ ఆశలు చెదిరిపోయాయి. రుషికొండపై గతంలో పర్యాటకశాఖ నిర్మించిన, చక్కగా, దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టారు. రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు. కానీ అక్కడ జగన్ నివాసానికి, సీఎం కార్యాలయానికి భవంతులు కట్టేశారు.
ప్రముఖ హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ల డాలర్లు వెచ్చించి కట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాల్ని తలదన్నే స్థాయిలో వాటిని నిర్మించారు. అక్కడ సీఎం కోసం నివాస, కార్యాలయ భవనాల్ని కడుతున్నా అప్పటి మంత్రులు మాత్రం అవి రిసార్టులేనని బుకాయించారు. వారి కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మితో ఒక కమిటీ వేసి, రుషికొండపై భవనాలు ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలమని సిఫార్సు చేయించారు. ఆమె ఆధ్వర్యంలోని కమిటీ విశాఖలో అన్ని భవనాలూ పరిశీలించిందని, చివరకు రుషికొండపై కట్టిన భవనాలే సీఎం నివాసానికి అనుకూలమని గుర్తించినట్టు చెప్పించారు.
చేయి వేస్తే మాసిపోయేంత వర్ణఛాయల్లో ఇటాలియన్ మార్బుల్ గోడలు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో బాత్రూమ్ ఫిటింగులు. ఒళ్లు పట్టించుకోవడానికి మసాజ్ రూమ్, సమావేశ మందిరం సైజులో పడక గదులు. 300 మంది ఓకేసారి వచ్చినా ఒకరికి ఒకరు తగలకుండా ఉండేంత విశాలమైన కారిడార్లు. 200 మందితో సమావేశం నిర్వహించడానికి అవసరమైన గదులు నిర్మించారు. ముఖ్యమైన ఫైళ్లు భద్రపరచడానికి లాకర్లు, నిర్మించిన ఏడు బ్లాకుల్లో మూడు జగన్ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నారు. అందులో ఒకటి జగన్ దంపతులకు ప్రెసిడెన్షియల్ సూట్ గా నామకరణం చేసుకున్నారు. ఇంకో రెండు విల్లా సూట్లు. ఆ రెండూ కుమార్తెల కోసం చెరొకటి నిర్మించారు.