Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకర్గం చేబ్రోలులో సెరీ కల్చర్ రైతులు, చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. చేనేత కార్మికులు తమ సమస్యలను పవన్‌కు వివరించారు. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడంతో నష్టపోతున్నామని నేతన్నలు తెలిపారు. వారి సమస్యలు విన్న పవన్..ఇతర నాయకుల మాదిరి తాను నోటికి వచ్చిన హామీలు ఇవ్వనని చేనేత కళాకారుల కష్టానికి తగ్గ ఫలితం వచ్చేటట్టు కృషి చేస్తానన్నారు. చేబ్రోలును సిల్క్ సిటిగా మార్చే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు.
సిల్క్ మీద ఉన్న జీఎస్టీ తొలగిస్తామని జీఎస్టీని కేంద్రం తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతీ చేనేత కుటుంబానికి నేను అండగా నిలబడతానని అన్నారు. ఏపీలో మూడున్నర ఏళ్లల్లో బంగారు భవిష్యత్తు చూపెడతాను.మీరు ఇప్పటి వరకు జగన్ లాంటి మోసగాళ్ల మాట విన్నారు. ఒక్కసారి నా మాట నమ్మి చూడండి. నేను వస్తున్నాను అంటే తడిసిన ధాన్యం కొంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నాయకులను అసెంబ్లీకి పంపించండి. ఒక్కసారి సీఎం చేయండి.మీకిచ్చిన హామీలు నెరవేర్చకపోతే దిగిపోమంటే దిగిపోతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ సారి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఒక్కసారి ప్రలోభాలకు లొంగిపోకుండా జనసేనకు మద్ధతుగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కోట్ల సంపదను వదులుకుని, నిస్వార్ధంగా సేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చానన్నారు. ఈ సీఎంలా ఒక కులానికే అన్ని పదవులు కట్టబెట్టకుండా..అన్ని కులాలను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పారు పవన్. ప్రతీ కులానికి దామాషా ప్రకారం న్యాయం చేస్తానని.రాజకీయాలలో జవాబుదారితనాన్ని తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.