Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన ప్రసంగించారు.
ధరణితో కేసీఆర్ కుటుంబానికే లాభం..(Rahul Gandhi)
దొరల పాలనలో ఏం జరుగుతోందో తెలంగాణ సమాజం గమనిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు.కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. తెలంగాణలో ధరణి పేరుతో పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ధరణితో కేవలం కేసీఆర్ కుటుంబానికే లాభమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని రాహుల్ అన్నారు. బీజేపీకి అవసరమయినప్పుడల్లా మజ్లిస్ బీజేపీకి అండగా నిలిచిందన్నారు. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి కేసులున్నాయని అయితే తెలంగాణ సీఎం పై మాత్రం లేవని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకూడదని రాహుల్ గాంధీ అన్నారు.
ఇక్కడ బీఆర్ఎస్, ఢిల్లీలో బీజేపీని ఓడిస్తామని రాహుల్ పేర్కొన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రౌతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15 వవేలు అందిస్తామని రాహుల్ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12 వేలు ఇస్తామన్నారు. ప్రియాంక అనారోగ్యం కారణంగా తాను ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా కొల్లాపూర్ సభకు వచ్చానని అన్నారు. ఈ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.