JanaSena chief Pawan Kalyan :భారతదేశంలో ముస్లింలు ఏనాటికీ మైనారిటీలు కారని, ఈ దేశం మనందరిదీ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ముస్లింల భద్రత, గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ చూసుకుంటుందని చెప్పారు. వారాహి విజయయాత్రలో భాగంగా మంగళవారం కాకినాడలో పవన్ కళ్యాణ్ ముస్లిం ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే ముస్లింల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవిభజన సమయంలో జరిగిన మతఘర్షణల వల్ల 10 లక్షలమంది మరణించారు. కొంతమంది హిందువులు పాకిస్తాన్ లో ఉండిపోతే మరికొంతమంది భారత్ లో ఉండిపోయారు. ముస్లింలు కూడా మా సోదరులు అనుకోబట్టే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారు. అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యారు. వ్యక్తుల్లో మంచి, చెడు మాట్లాడుకోవాలి తప్ప మతం గురించి కాదని అన్నారు.
గత ఎన్నికల్లో ముస్లింలు వైసీపీని పూర్తిగా నమ్మి మద్దతు ఇచ్చారు. ఆ పార్టీకి 30 మంది ఎంపీలు ఉన్నారు. 25 ఎంపీలు ఇస్తే బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకు వస్తానని చెప్పిన నాయకుడు ఢిల్లీ వెళ్లి ఏం వంచుతున్నాడో మనందరికీ తెలుసు. నేను వైసీపీలా గుడ్డిగా బీజేపీకి మద్దతు ఇవ్వను. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం ప్రతినిధులకు ఇఫ్తార్ ఇవ్వడంతో పాటు ఇస్లాం విద్య,ధార్మిక సంస్దలకు రూ.25 లక్షలు విరాళం ఇచ్చాను. నా వ్యక్తిగత సంపదను మీకు ఇచ్చిన వాడిని. రేపు జనసేన అధికారంలోకి ఎంతగా అండగా ఉంటానో ఊహించండి. జనసేన అధికారంలోకి వస్తే ఉర్దూ మీడియంను మరలా తీసుకు వస్తామని పవన్ హామీ ఇచ్చారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదు. జగన్ క్రిస్టియన్ కాబట్టి ఆయనను నమ్మవచ్చని ముస్లింలు అనుకుంటున్నారు. నేను బీజేపీతో ఉన్నానని ముస్లింలు నన్ను వదిలేస్తే మీరు నష్టపోతారు. ముస్లింలు జనసేనకు అండగా నిలవండని పవన్ కళ్యాణ్ కోరారు.