Janasenani Pawan Kalyan: ఈ సారి అసెంబ్లీలోకి నన్ను ఎవడు అడుగు పెట్టనీయడో నేను చూస్తాను.. అసెంబ్లీలోకి జనసేన అడుగుపెడుతుంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలెంజ్ చేసారు. బుధవారం రాత్రి కత్తిపూడి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రికి చాలెంజ్ చేస్తున్నాను. వైసీపిని పడదోస్తాము. కూలదోస్తామని స్పష్టం చేసారు. తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయాలని గత ఎన్నికల్లో భీమవరంలో ఉన్న ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చేసారని అన్నారు.
ముఖ్యమంత్రి అమాయకంగా క్లాస్ వార్ అంటున్నారు. ప్రజలను మోసం చేస్తూ వేలకోట్లు సంపాదిస్తూ, సూట్ కేసు కంపెనీలు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. ఈ సీఎం క్లాస్ వార్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? సినిమా టిక్కెట్ల మీద కూడా రాజకీయం చేసే సీఎంను మొదటిసారి చూస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. మీకు రాజ్యాధికారం వస్తే బాగా చేసుకోండి. కాని మేము నీకు బానిసలం కాదు. వ్యతిరేకంగా మాట్లాడితే పధకాలు ఇవ్వననడానికి మీరెవరు? అవి మా డబ్బులు. అవి ఇవ్వమని ఎలా చెబుతారు? నేను గొడవ పెట్టుకుంటుంది వేల కోట్ల రూపాయలు వున్న వ్యక్తులతో. తండ్రులు సీఎం అయితే నన్ను పాలించే వాడు నా కన్నా నిజాయితీ పరుడయి ఉండాలి. ఒక ఉద్యోగి అవినీతి చేస్తే ఏసీబీ పట్టుకుంటుంది. కాని సీఎం అవినీతికి పాల్పడితే ఎవరు పట్టుకుంటారు? దిగువ మధ్యతరగతి నుంచి వచ్చినవాడిని. ఆ ఆవేదన. ఆవేశంతో మీ భవిష్యత్తు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. నాయకులు బాధ్యతగా లేనపుడు చొక్కా పట్టుకుని అడుగుతామని పవన్ స్పష్టం చేసారు.
పార్టీ గెలవడం, ఓడిపోవడం పక్కన పెడితే పదేళ్ల పాటు పార్టీని నడపడం సామాన్యమైన విషయం కాదు. కర్ణుడు సహజకుండలాలతో పుట్టినట్లు నేను మీ అభిమాన కవచంతో పుట్టాను. ఇపుడు ఉన్న కొత్త తరానికి, ఓటు హక్కు వచ్చిన వారికి తెలియదు. ఒక వ్యక్తి బలిదానం కారణంగా మనకు ఆంధ్రరాష్ట్రం వచ్చింది. ఆయన పేరు పొట్టి శ్రీరాములు. ఈ రోజు సీఎం ఎవరయినా ఆయన ముందు మోకరిల్లవలసిందే. జనసేన పొట్టి శ్రీరాములుగారి స్పూర్తితో వచ్చింది. 56 రోజులు ఆకలి తట్టుకుని పేగలు మాడిపోతుంటే ఆంధ్రరాష్ట్రం కావాలని అమరుడయిన అమరజీవికి రెండు చేతులు ఎత్తి నివాళులు అర్పిస్తున్నాను. అలాగే చేగువేరా నుంచి పోరాటస్పూర్తిని పొందానని పవన్ కళ్యాణ్ అన్నారు.