CM Chandrababu in kuppam: వైసీపీని రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా విర్రవీగితే ఇదేగతి పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు స్దానిక బస్టాండు సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజలు కూటమికి చరిత్రాత్మక విజయం ఇచ్చారని.. రాష్ట్ర భవిష్యత్‌ను తిరగ రాస్తానని చెప్పారు. గత ఐదేళ్లు ఎన్నో అరాచకాలు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనను ప్రజలు అసహ్యించుకున్నారని చెప్పారు. కుప్పం ప్రశాంతమైన స్దలం అని ఇటువంటి చోట దౌర్జన్యం చేస్తే సహించేది లేదని అన్నారు. గత ఐదేళ్లుగా ఇక్కడ ఎలాంటి అభివృద్ది జరగలేదన్న చంద్రబాబు ప్రతీ ఊరిలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కుప్పం త్వరలో రైల్వే జంక్షన్ గా మారుతుందని విమానాశ్రయం కూడా వస్తుందన్నారు. ఈ సందర్బంగా అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన డ్వాక్రా మహిళలను చంద్రబాబు అభినందించారు
తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. జల్లిగానిపల్లిలో హంద్రీ-నీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన కాలువ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలువ స్థితిగతులపై ఆరా తీశారు. కుప్పంలో నిర్మాణంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబు పరిశీలించారు. నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. జగన్ హయాంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో గత మూడేళ్లుగా చంద్రబాబు ఇంటి నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ఇటీవల మళ్లీ ఇంటి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.కుప్పం చేరుకున్న చంద్రబాబుకు ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.