MLA Mynampally Hanumantha Rao: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన భవిష్యత్ కార్యాచరణని రేపు ప్రకటించనున్నారు. తన మనుమడి పుట్టు వెంట్రుకలని శ్రీవారి చెంత తీయించడానికే వచ్చానని మైనంపల్లి చెబుతున్నారు. మైనంపల్లి తిరుమలలో మరోసారి మీడియాతో మాట్లాడారు.
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని మైనంపల్లి అన్నారు. నిన్న తాను చేసినవి వ్యక్తిగత వ్యాఖ్యలన్న మైనంపల్లి హైదరాబాద్ వెళ్ళాక భవిష్యత్ గురించి అనుచరులతో సమాలోచనలు చేస్తానని చెప్పారు. మెదక్, మల్కాజ్‌గిరి ప్రజలతో మాట్లాడి తర్వాతి కార్యాచరణ చెప్తానన్న మైనంపల్లి ప్రజల మద్దతు తనకుందని అన్నారు. తనకి తన కుమారుడికి టికెట్లు ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తామని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు. నా కుమారుడు ప్రజాసేవ చేస్తున్నాడు. అతనికి సపోర్టుగా ఉండవలసిన బాధ్యత నాకుంది. అది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిగతం అనేది ముఖ్యం. నన్ను నమ్ముకుని ఉన్న క్యాడర్ ఉంది. వారికి అండగా ఉండవలసిన బాధ్యత నాకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు సార్లు గెలిచిన రికార్డు నాది. నిన్న నా వ్యక్తిగత అభిప్రాయాలు స్వామి వారి సన్నిధిలో చెప్పాను. పార్టీ గురించి నేను ఏమీ కామెంట్ చేయలేదు. ముఖ్యమంత్రిగారు కూడా నా గురించి ఎటువంటి కామెంట్ చేయలేదు. అయితే నాకు, నా కొడుక్కి ఇద్దరికి టిక్కెట్లు ఇస్తే మంచి మెజారిటీతో గెలిచి తీరుతాము. నన్ను అనవసరంగా టచ్ చేస్తే మాత్రం ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని మైనంపల్లి స్పష్టం చేసారు.
సోమవారం బీఆర్ఎస్ ఎమ్మల్యే అభ్యర్దులను ప్రకటించిన సీఎం కేసీఆర్ మల్కాజ్ గిరి నుంచి మరోసారి మైనంపల్లికి అవకాశం కల్పించారు. అయితే మెదక్ టిక్కెట్ ను ఆశించిన ఆయన కుమారుడు రోహిత్ కు మాత్రం నిరాశ ఎదురయింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మరోసారి టిక్కెట్ ఇచ్చారు. దీనితో మైనంపల్లి తదుపరి అడుగులు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.