Pawan Kalyan’s challenge:ఒళ్లు పొగరెక్కి వున్నావు..మీ తాతకు డీటీ నాయక్ చేసినట్లు నీకు ఈ భీమ్లా నాయక్ చేస్తాడంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపు రెడ్డి చంద్రశేఖర రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో ఆదివారం రాత్రి ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ద్వారపురెడ్డికి అధికార బలుపు, తిమ్మిరి ఎక్కువయ్యాయని వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గెలవకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
మూడేళ్లలో 15 వేల కోట్లు సంపాదన..(Pawan Kalyan’s challenge)
కాకినాడ రిటైరయిన వారికి స్వర్గంలా ఉంటుందని అలాంటి చోట ద్వారపు రెడ్డి చంద్రశేఖర రెడ్డి భూ కబ్జాలు, గూండాగిరితో ప్రజలను హడలెత్తిస్తున్నాడని పవన్ ఆరోపించారు. ఈ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దగ్గర 500 మంది క్రిమినల్ గ్యాంగ్ అందరినీ బెదిరిస్తున్నారు. మీ పద్దతి మార్చుకోండి. నాకు అధికారం, అవకాశం వచ్చిన రోజున వీధుల్లో తన్నిస్తాను. ఆడపిల్లల జోలికెళ్లినా వారిని ఏం చేసినా మీ తాతకు డీటీ నాయక్ చేసినట్లు ఈ భీమ్లా నాయక్ చేస్తాడు. ఒళ్లు పొగరెక్కి వున్నావు. నీకు ఎంత బలుపంటే డబ్బులు ఎక్కువయి వచ్చిన బలుపు. నీ పతనం మొదలయింది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే నాపేరు పవన్ కళ్యాణ్ కాదు. నా పార్టీ పేరు జనసేన కాదు అంటూ పవన్ చాలెంజ్ చేసారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబును మేమే రాజకీయాల్లోకి తీసుకు వచ్చాము. అది మా దురదృష్టం. ఎక్కడైతే ఖాళీ స్దలాలు ఉన్నాయో అక్కడ ఎమ్మేల్యే ద్వారంపూడి మనుషులు కబ్జాలు చేస్తున్నారు. ఏ పని చేద్దామన్నా 30 శాతం కమీషన్. మడ అడవులను నరికివేయడం, ఇళ్ల పేరు మీద జనాల స్దలాలను లాక్కోవడం చేస్తున్నారు. మూడేళ్లలో 15 వేల కోట్లు సంపాదించారు. తోట త్రిమూర్తులు, కన్నబాబు వీరందరూ ఏం చేస్తున్నారు? వీరికి ముఖ్యమంత్రిని చూస్తే భయం.. కాని పవన్ కళ్యాణ్ కు భయం లేదని అన్నారు.
మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు..
కాకినాడ ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి పవన్ కళ్యాణ్ ను ఏమైనా అనవచ్చు అనే ఉద్దేశ్యంతోటి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఈ విషయాన్ని మన పార్టీవాళ్లు చెప్పారు. అయితే నాకు కోపం రాలేదు. జనసైనికులు నిరసన తెలపడానికి వారింటికి వెళ్లారు. మన నాయకులపైన రాళ్ల దాడులు చేయించారు. జనసైనికులు, వీరమహిళలపైన దాడి చేయగానే నాకు కోపం వచ్చింది. ఆ రోజు నేను నోరు విప్పితే ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. వైసీపీ నాయకుల దోపిడీలు, క్రిమినల్ యాక్టివిటీస్ చూసాను. ఈ ముఖ్యమంత్రి రౌడీయిజం, గూండాగిరి, దోపిడీ చేస్తే నాలాంటి వాడు ఎదురు తిరుగుతాడు. వీళ్లు మనుషుల్ని, సమాజాన్ని కులాల పరంగా విడదీస్తున్నారు. నేను ఏ రోజు ఒక కులం ఎక్కువ, తక్కువ అని చెప్పలేదు. ఇంకొక్కసారి కులదూషణ చేసావా, రెచ్చగొట్టావా మర్యాదగా ఉండదు. ద్వారంపూడి వద్ద ఉండే దళిత యువతకు చెపుతున్నాను. వైసీపీ ఎమ్మెల్సీ తన దళిత కారు డ్రైవర్ ను కొట్టి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసాడు. వైసీపీ ప్రభుత్వం దళితులకు ఉండే 18 పధకాలు తీసేసింది. క్రైమ్ చేసేవాడు ఏ కులమైనా వదిలేది లేదు. కులాలన్ని బాగుండాలి. యువత కులాలకు అతీతంగా ఉండాలి. ఉభయ గోదావరి జిల్లాలకు అందుబాటులో ఉంటాను. ఏ సమస్య అయినా సరే, ఏ గూండా గాడైనా సరే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటూ పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపండి..
ప్రజస్వామ్యం అనేది నాయకులు సరిగా లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు అస్తవ్యస్తమవుతుంది. నాయకులు వారి స్వలాభానికే చూసుకుంటే ఎలా ఉంటుందో కాకినాడ జనవాణి కార్యక్రమంలో తెలిసింది. క. నన్ను పాలించేవాడు సగటు మనిషికన్నా నిజాయితీగా ఉండాలి. క్రిమినల్ గా ఉంటూ రాజకీయంగా వచ్చి మనలను నిర్దేశిస్తానంటే నాకు కోపం. నన్ను పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారు అయితే నేను ఏం చేయాలి? బాపట్ల జిల్లాలో తన అక్కను ఏడిపిస్తుంటే అడ్డుకున్నాడని ఒక కుర్రాడిని కాల్చి చంపేసారు. అలాంటి క్రిమినల్స్ ని మన కులం వాడని అక్కున చేర్చుకుంటామా?బీసీ కులానికి చెందిన ఒక మంత్రి లక్షరూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నారు. ఒక ఎంపీ భార్యని, కొడుకుని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్క పవన్ కళ్యాణ్ ది కాదు. అందరూ హీరోలు నాకు ఇష్టమే. సినిమాను, రాజకీయాన్ని వేరు చేసి చూడండని యువతకు చెబుతున్నాను. సొంత చిన్నాయన వైఎస్ వివేకానంద గారినే చంపేసారు. ఆయన కూతురు సునీత ఎక్కని కోర్టు లేదు. మీకు ఉపాధి అవకాశాలు లేవు. ఫీజు రీఎంబర్స్ మెంట్ లేదు. రెండున్నర లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన వ్యక్తి మోసం చేసాడు మూడు కంపెనీలకే ఇసుక కాంట్రాక్టులు. ఒకటి ముఖ్యమంత్రి చుట్టూ, మరొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరొకటి వారి కుటుంబ సభ్యుల చుట్టూ ఉన్నాయి. ద్వారంపూడి లాంటి గూండాలతో పోరాటం చేయాలంటే దైర్యం ఉండాలి. మీరు ఒక్కసారి నన్ను. నా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించండి. నేను వచ్చి మాట్లాడతాను. ఏ అధికారంలేకున్నా,దశాబ్దం నుంచి పోరాడుతున్నాను.మీరు సినిమా టిక్కెట్ల కోసం అంత క్యూలో నిల్చుంటారు. కాని ఓటు వేయడానికి ఓపిక వుండదు. మధ్య తరగతి మేధావుల మౌనమే గూండా రాజకీయాలకు కారణమవుతోందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.