CM YS Jagan comments:ఏ ఒక్క ఎమ్మెల్యేను, కార్యకర్తను తాను పోగొట్టుకోవాలని అనుకోనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, రీజనల్ ఇన్ చార్జిలతో ఆయన కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలిచినా అది వచ్చే ఎన్నికలకి గీటురాయి కాదని, ఏమాత్రం ప్రభావం చూపబోదని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఎన్నికలు సంవత్సరంలోపే ఉంటాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలన్నారు.
గడపగడపకూ సీరియస్ గా తీసుకోవాలి..(CM YS Jagan comments)
గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని జగన్ సూచించారు. ఈ కార్యక్రమం జరిగితే పార్టీ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగకపోతే పార్టీకి నష్టమన్నారు. మనం అధికారంలో లేకపోతే కోట్లమది ప్రజలు నష్టపోతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును బూతద్దంలో చూపించి అంతా వారికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు.కాని వాస్తవానికి అన్ని రకాల యూనియన్లు, పార్టీలు కలిసి రావడం వలన టీడీపీ గెలిచిందని జగన్ అన్నారు. దీనిని సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదన్నారు. కేవలం వాపును చూసి బలం అనుకుంటున్నారని అన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
తాను వచ్చే ఎన్నికల్లో 60మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ తెలిపారు. అంతేకాదు ఎమ్మెల్యేలను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రచారం ఇంకా ఎక్కువగా సాగుతుందని అందుకే కేడర్ క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. ప్రతి లబ్దిదారును కలవాలని అన్ని సచివాలయాల్లోనూ గడపగడపకూ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. సచివాలయ కన్వీనర్లు. గృహసారధుల వ్యవస్దను పూర్తి చేసుకోవాలని, సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని జగన్ సూచించారు. మీతో పనిచేయించి మిమ్నల్ని తిరిగి గెలిపించాలనే తాను ఈ కార్యక్రమాలన్నింటిని చేస్తున్నానని జగన్ పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మంత్రులు విడదల రజని, ధర్మాన, మాజీ మంత్రి కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డుమ్మా కొట్టారు. వారు వ్యక్తిగత కారణాలతో రానట్టు సమాచారం.