Adilabad MP Soyam Bapurao: అదిలాబాద్ యం.పి సోయం బాపు రావు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. పార్టీ నేతలతో తన నివాసం లో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను ఎంపీ ల్యాడ్స్ నిధులు సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. సొంత ఇల్లు లేకపోతే గౌరవం ఉండదనే కారణంతో ఎంపీ నిధులలో కొంత నిధులతో ఇల్లు కట్టుకున్నాననీ,, ఎంపీ నిధులతోనే నా కుమారుడి పెళ్లి చేశాను. అయితే గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నిధుల గోల్మాల్ చేయలేదు, కొంత నా అవసరాలకు వాడానని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో ఎంపీలు నిధులన్నీ అమ్ముకున్నారు.. (Adilabad MP Soyam Bapurao)
గతంలో ఎంపీలు నిధులన్నీ అమ్ముకున్నారని, తాను మాత్రం కొన్ని నిధులు మాత్రమే వాడుకున్నానని బహిరంగంగానే ఒప్పుకున్నారు. ధర్మపురి అరవింద్ , బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కంటే ఎక్కువ నిధులు తనకే వచ్చాయన్నారు. ప్రస్తుతం ఉన్న నిధులను ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు సమానంగా కేటాయిస్తామని ఎంపీ బాపురావు వ్యాఖ్యానించారు. ఒకసారి తన సొంతానికి నిధులు వాడుకున్నానని మరలా వాడుకుంటే తనకు గౌరవం ఉండదని అన్నారు.
ఇప్పుడు ఎంపీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ లాడ్స్ ను అభివృద్దికి ఇష్టానుసారంగా ఎలా వాడుకుంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీ నిధులను ప్రజల కోసం ఖర్చు చేయకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బాపురావుపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. మరి ఎంపీ బాపురావు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.