Husband killed wife :ఇటీవల కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త ఉదంతం మరవక ముందే అలాంటిదే మరో సంఘటన తాజాగా జరిగింది. వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన హైదరాబాద్ లోని, బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నవీన్ దుర్వే, రవీనా దుర్వే నగరానికి వలస వచ్చి బాచుపల్లిలోని ప్రగతి కన్‌స్ట్రక్షన్స్‌లో కూలీలుగా పనిచేస్తూ పక్కనే వున్న గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. .రోజు కూలి పని చేసుకుని బ్రతుకు వెళ్లదీస్తున్న నవీన్ దుర్వే దంపతులకు ముగ్గురు సంతానం.
ఇటుకతో తలపై మోదడంతో..(Husband killed wife)
వంట విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. వంట సరిగా చేయడం లేదని ఆగ్రహానికి లోనైన నవీన్ ఇటుకతో భార్య రవీనా తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వలన ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి .పిల్లలు అనాధులుగా మిగులుతున్నారు .